తెలంగాణలో పెట్టుబడులపై దావోస్‌లో..
పెట్టుబడులను ఆకర్షించడానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే . ఇందులో భాగంగా అత్యంత కీలకమైన సమావేశాలకు రేవంత్ బృందం సర్వసన్నద్ధమైంది. సప్లయ్ చైన్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఇన్నొవేషన్ రంగాల్లో ప్రఖ్యాత కంపెనీ ఎజిలిటీ (Agility Logistics) వైస్ చైర్మన్ తారెక్ సుల్తాన్ తో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు.తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించటంతో పాటు రైతుల ఆదాయాన్ని స్థిరంగా పెంచేందుకు ఇస్తున్న ప్రాధాన్యతలను మంత్రి శ్రీధర్ బాబు ఈ సమావేశంలో వివరించారు.అదేవిధంగా తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మరో దిగ్గజ కంపెనీతో చర్చలు జరిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి డి. శ్రీధర్ బాబుతో పాటు పరిశ్రమల శాఖ అధికారులు యూనిలివర్ సీఈవో హీన్ షూమేకర్, ఆ కంపెనీ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విల్లెం ఉయిజెన్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో వ్యాపార అవకాశాలు, పెట్టుబడులకు ఉన్న సానుకూలతలను చర్చించారు.