NewsTelangana

భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం లొల్లి

హైదరాబాద్‌లో వినాయక చవితి ప్రారంభమైనప్పటి నుంచి నిమజ్జనానికి సంబంధించి వివాదాలు మొదలయ్యాయి. హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ డిమాండ్ చేస్తుంది. అయితే ప్రభుత్వం మాత్రం ఇందుకు అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించింది.

దీంతో హైదరాబాద్ గణేష్ నిమజ్జన కమిటీ అధ్యక్షుడు భగవంతరావు నేడు ట్యాంక్ బండ్‌పై బైక్ ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్యాంక్ బండ్‌పై ఈ రోజు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ప్రస్తుతం అక్కడ నిరసనకారులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఇటువంటి పరిస్థితులలో తమ ప్రభుత్వం పండుగలను రాజకీయం చేయదని… వాటిని ఎలా నిర్వహించాలో తెలుసనని చెప్పిన టీఆర్‌ఎస్ మంత్రులు ఏం చేస్తారో చూడాల్సివుంది. మరి ఇంకో రెండు రోజుల్లో జరగనున్న ఈ నిమజ్జనంపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.