‘అధ్యక్ష ఎన్నికలలో ఓడిపోతే వెళ్లేది అక్కడికే.’.. ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఒక ఇంటర్యూలో పాల్గొన్నారు. ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆయనను ప్రత్యేకంగా ఇంటర్యూ చేశారు. రాబోయే అధ్యక్ష ఎన్నికలలో తాను ఓటమి పాలయితే, దేశం విడిచి వెళ్లిపోతానంటూ ఛాలెంజ్ చేశారు ట్రంప్. ఈ ఎన్నికలలో ఓడిపోతే అమెరికాలో ఉండనని, వెనెజువెలాకు వెళ్లిపోతానని, అక్కడ సమావేశమై, డిన్నర్ చేద్దాం అని మస్క్‌తో పేర్కొన్నారు ట్రంప్. అక్కడి ప్రమాదకరమైన నేరగాళ్లను జైళ్ల నుండి విడుదల చేసి, అమెరికాకు అక్రమంగా వలస పంపిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. దీనితో అక్కడి నేరాలు తగ్గి, అమెరికాలో నేరాలు పెరుగుతున్నాయని దుయ్యబట్టారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వలసల చట్టాన్ని కఠినతరం చేస్తానని, వలసదారులను అడ్డుకుంటానని పేర్కొన్నారు. ట్రంప్‌తో మస్క్ చేసిన ఇంటర్యూకు చాలా ఆదరణ లభించింది. దీనిని ఎక్స్ స్పేస్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేశారు. ఈ ఇంటర్యూకు 200 మిలియన్ల పైగా వ్యూస్ వచ్చాయి.