కాలేజీ మారాల్సివస్తే..ఫీజు వాపస్
అడ్మిషన్ తీసుకుని, ఫీజు చెల్లించాక ఆ కాలేజీ నుండి వేరే కాలేజీకి మారాల్సి వస్తే .. అక్కడ కట్టిన ఫీజును విద్యార్ధులు వదులుకోవాల్సి వచ్చేది. దీంతో విద్యార్థుల తల్లితండ్రులపై ఆర్ధిక భారం పెరుగుతూ వచ్చేది. దీనిపై దృష్టి పెట్టిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ విద్యార్థులకు ఉపయోగపడేలా ఓ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కరోనా కారణంగా కూడా ఎంతో మంది విద్యార్థుల తల్లితండ్రులు పిల్లలకు ఫీజు కట్టే విషయంలో చాలా అవస్థలు పడ్డారు.

దీని నుంచి వారికి విముక్తి కల్పించే విధంగా యూజీసీ దేశంలోని అన్ని కాలేజీలకు నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. అనుకోని పరిస్థితులలో కాలేజీ మారాల్సి వస్తే.. ఆయా కాలేజీలలో విద్యార్ధులు చెల్లించిన మొత్తం ఫీజును తిరిగి వారికి వాపస్ ఇవ్వాలని సూచించింది. ఈ మార్గదర్శకాలను దాదాపు అన్ని కాలేజీలు పాటించాలని యూజీసీ వెల్లడించింది. అయితే ఈ నూతన మార్గదర్శకాలను 2022-23 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని యూజీసీ నిర్ణయించింది. ఈ ఏడాది అక్టోబర్ 31లోపు కాలేజీ మారాలంటే..విద్యార్థులు అప్పటి వరకు కట్టిన మొత్తం ఫీజును ఆయా కాలేజీలు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా డిసెంబర్ 31లోపు అయితే కేవలం రూ.1000/- రూపాయలు మాత్రమే కళాశాలలకు విద్యార్ధులు చెల్లించాలని యూజీసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం పట్ల విద్యార్థులు,తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

