ఇవి తింటే మెరిసే కురులు మీ సొంతం
పట్టుకుచ్చులాంటి మెరిసే నల్లని కురులు కావాలని ప్రతీ మహిళా ఆశపడుతుంది. అయితే ఇలాంటి శిరోజాలు కావాలంటే వాటి సంరక్షణకు శ్రద్ధ వహించడంతో పాటు కొన్ని ముఖ్యమైన ఆహార పదార్ధాలు తీసుకోవలసి ఉంటుంది. పైపై పూతలు ఎన్నిపూసినా, బలహీనమైన వెంట్రుకలు బలంగా మారవు. వాటికి కుదుళ్ల నుండి బలం, పోషణ అవసరం. శిరోజాల సంరక్షణలో మంచి ఆహారానికి ప్రముఖపాత్ర ఉంటుంది. చేపలు, గుడ్లు, అవకాడో, పాలకూర, జామపళ్లు, సిట్రస్ పండ్లు, బాదం పప్పులు వంటి ఆహారం రోజూ తినాలి. వంటకాలకు ఆలివ్ నూనె వాడితే మంచిది. పీహెచ్ స్థాయిలు 5 నుండి 5.5 ఉండే షాంపూలే వాడాలి. వీటిలో సల్ఫేట్స్, పారాబెన్స్, హెక్సా క్లోరోఫిన్ వంటివి లేకుండా చూసుకోండి.

జింక్ పైరథాన్, టీట్రీ ఆయిల్ ఉండే షాంపూలను, నూనెలను వాడితే చుండ్రును పోగొట్టి కురులను మెరిపిస్తాయి. అతిగా తలస్నానాలు చేయడం, ఆల్కహాల్ ఉన్న హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తులు, డ్రైయ్యర్‌ను అధికంగా వాడడం, ఎండలో తిరగడం వంటి చర్యల వలన తలలో సహజ నూనెలు ఉత్పత్తి కావు. కాబట్టి వారానికి రెండుసార్లు తలస్నానం చేస్తే చాలు. తలస్నానానికి ముందు జొజొబా, ఆలివ్, కొబ్బరినూనెలతో మర్థనా చేసుకోవాలి. స్నానం పూర్తయ్యాక, తలకు కండిషనింగ్ కూడా చేస్తే మంచిది. మంచి హెయిర్ మాస్క్‌లు కూడా కురులను బలంగా మారుస్తాయి. పావుకప్పు ఆలివ్ నూనె, తేనె కలిపిన మిశ్రమం హెయిర్ మాస్క్‌గా వాడొచ్చు. వెచ్చని టవల్‌తో తలను కప్పి అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు నిగనిగలాడుతుంది.

