“మాతప్పు తేలితే పవన్ కళ్యాణ్ బూట్లు తుడుస్తాం”…అంబటి ఫైర్
తిరుమల లడ్డూ వ్యవహారంపై వివాదం ముదురుతూనే ఉంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. తాజాగా మాజీమంత్రి అంబటి రాంబాబు ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు ఏదీ లేకపోయినా కూటమి నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మాతప్పు ఉందని నిరూపిస్తే పవన్ కళ్యాణ్ బూట్లు తుడవడానికి కూడా సిద్ధమన్నారు. పవన్ లాగానే మేం కూడా దీక్ష తీసుకుంటాం అన్నారు. చంద్రబాబు హిందూధర్మాన్ని ఎక్కడ పాటించాడని తన తండ్రి చనిపోతే తలనీలాలు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. తిరుమలలో ఆంజనేయస్వామిపై ప్రమాణం చేసి, లడ్డూ అపవిత్రం అయ్యిందని చెప్పగలరా అంటూ సవాల్ చేశారు. పవిత్రమైన వేంకటేశ్వరస్వామి దేవాలయంపై అసత్య ప్రచారాలు, నీచ రాజకీయాలు చేయవద్దని హెచ్చరించారు. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుండి ప్రజల దృష్టి మళ్లించడానికే ఇలాంటి పనులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

