పార్టీ పటిష్టం కావాలంటే .. తలైవర్ రావాల్సిందే !
ఉత్తర భారతాన్ని చుట్టేసి.. పట్టేసి .. కొట్టేసిన బీజేపీ చూపు ఇప్పుడు పూర్తిగా దక్షిణాది మీదే ఉంది. కర్నాటకలో అమేయ శక్తిగా ఎదిగింది. అధికారంలో కొనసాగుతోంది. తెలంగాణలో అధికారం చేపట్టేందుకు తహతహలాడుతోంది. బలీయమైన ప్రత్యామ్నాయ శక్తిగా వేళ్ళూనుకుంది. దృష్టి పెడితే ఏపీలో కూడా బలపడే అవకాశాలు ఎన్నో ఉన్నాయని భావిస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇక కేరళలో కూడా పాదం మోపినా .. చెప్పుకోతగ్గ స్ధాయిలో ఎదగలేక పోయింది. కమ్యూనిస్టుల ధాటిని తట్టుకుని నిలబడేందుకు శతధా ప్రయత్నిస్తూనే ఉంది. ఇక ఎప్పటి నుండో తమిళనాడులో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న కమలనాధులు .. కార్యాచరణకు పదును పెడుతున్నారు. పునాదులు పటిష్టం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. తలైవర్ ను రంగంలోకి దించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గవర్నర్ గిరి తో ఆయనను రాజకీయాల్లోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు జోరందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇటు కరుణానిధి లేరు.. అటు జయలలిత లేరు. చిన్నమ్మ రాజకీయాల నుండి తప్పుకున్నారు. దిగ్గజాలు లేకుండా అసలు తమిళ రాజకీయాలను ఊహించడం చాలా కష్టం.
ఐదు దశాబ్దాల క్రితం తమిళనాడులో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరిచిన కాంగ్రెస్ పరిస్ధితి ఇప్పుడు అంతంతమాత్రంగానే ఉంది. జాతీయ పార్టీలకు అసలు స్ధానం లేకుండా పోయింది. అయితే అన్నాడీఎంకే.. కాకపోతే డీఎంకే. ఈ రెండు పార్టీల హవానే ఇక్కడ ఎక్కువగా కొనసాగుతున్నాయి. కొన్ని దశాబ్దాలుగా ఆ రెండు పార్టీలకే ప్రజలు అధికారాన్ని కట్టబెడుతూ వస్తున్నారు. కరుణానిధి వారసునిగా ఎం.కే. స్టాలిన్ ఇప్పుడు తమిళనాట అధికార పగ్గాలు చేపట్టాడు. జనరంజకమైన పథకాలతో ముందుకు వెళుతున్నాడు. గతంలో పరిపాలన సాగించిన వారందరికంటే భేష్ అనిపించుకునే పనిలో పడ్డాడు. హిందుత్వ వాదాన్ని, సనాతన సాంప్రదాయాన్ని , ఆచార వ్యవహారాలను అస్సలు పట్టించుకోని డీఎంకే .. గత ఎన్నికల్లో తన వ్యూహాలను మార్చి .. వారందరికీ దగ్గరయ్యే ప్రయత్నాలు చేసింది. హిందుత్వాన్ని, సనాతనత్వాన్ని గౌరవిస్తామని చెప్పింది. దేవాలయాల పురోభివృద్ధికి పాటుపడతామంది. వ్యూహాలు ఫలించి అత్యధిక మెజారిటీతో స్టాలిన్ గెలుపొందారు. ఇందుకు కొన్ని అంశాలు కూడా డీఎంకేకు బాగా కలిసొచ్చాయి. అన్నా డీఎంకేలో అనైక్యత.. మిగతా పార్టీలు బలంగా లేకపోవడం.. కమల్ హసన్ లాంటి వారు కూడా రాజకీయంగా నిలదొక్కుకోలేక పోవడం, జాతీయ పార్టీల పరిస్ధితి ఏమాత్రం బాగోలేక పోవడం వంటివి డీఎంకేకు కలిసొచ్చిన అంశాలుగా చెప్పాలి.

గత ఎన్నికల ముందు వరకు అసెంబ్లీలో ప్రాతినిద్యంలేని బీజేపీ .. 2021లో జరిగిన ఎన్నికలు బాగా కలిసొచ్చాయి. అన్నాడీఎంకే, పీఎంకే పార్టీలతో కలిసి పోటీ చేసిన బీజేపీ నాలుగు స్ధానాల్లో విజయభేరి మోగించి తమిళనాడులో కొత్త అధ్యాయానికి తెరదీసింది. నాగర్ కోయిల్, తిరునల్వేలి, మోదకురుచ్చి, కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గాల్లో బీజేపీ తన సత్తా చాటింది. ఈ విజయంతోనే ఇప్పుడు రాష్ట్రంలో బలంగా విస్తరించాలని.. పార్టీకి గట్టి పునాదులు వేయాలని భావిస్తోంది. అన్ని వర్గాలకు దగ్గరయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాను రాజ్యసభకు పంపింది. గతకొంతకాలంగా రాజకీయాల్లోకి రావాలని ఉవ్వెళ్ళూరిన తమిళ సూపర్ స్ఠార్ రజనీకాంత్ ను బీజేపీలోకి రప్పించేందుకు అన్ని విధాలా కృషి ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో మాస్ ఇమేజ్ ఉన్న నటుడు రజనీకాంత్. ఆయన పార్టీలో చేరితే ఇక తమిళనాడును యధేచ్ఛగా ఏలచ్చని ప్లాన్ చేస్తోంది. అయితే ఇందుకు ఏం చేయాలి ? ఎలా అడుగులు వేయాలి అని ఆలోచిస్తే .. ఓ మార్గం కనిపించింది. అదే.. తలైవర్ కి గవర్నర్ గిరి అప్పగించాలని. తమ మనిషిగా, బీజేపీ నేతగా ఆయనను ఎస్టాబ్లిష్ చేయాలని ఎత్తు వేసింది. ఆజాదీ కా అమృత మహోత్సవ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్ళిన రజనీ .. అక్కడ చాలా బిజీబిజీగా గడిపారు. ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, రాజ్ నాధ్ సింగ్, తదితరులను కలుసుకున్నారు. సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఇవన్నీ కొత్త సంకేతాలు ఇచ్చే అంశాలేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఢిల్లీ పర్యటన ముగించుకుని రావడం రావడమే నేరుగా వెళ్ళి తమిళనాడు గవర్నర్ రవితో భేటీ అయ్యారు. అంతకు ముందు సినీ నిర్మాత ఇంటిపై ఐటీ దాడులు జరిగిన నేపధ్యంలో ఆ అంశంపై గవర్నర్ ను కలిశారని అంతా భావించారు. ఆ కలయికలో రాజకీయ అంశాలు ఏవీ లేని అనుకున్నారు. కానీ.. గవర్నర్ తో అనేక రాజకీయాంశాలు ప్రస్తావన చేశానంటూ రజనీయే ప్రకటించారు. రాజ్యాంగ పరిరక్షకుడైన గవర్నర్ తో రాజకీయాల గురించి చర్చించడం ఏమిటంటూ కాంగ్రెస్ అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. అనేక విమర్శలను ఎక్కు పెట్టింది. వామపక్షాలు కూడా గవర్నర్ తీరుపై ధ్వజమెత్తాయి. ఇదంతా ఓ స్కెచ్. బీజేపీ తయారు చేసిన స్క్రీన్ ప్లే అని అందరికీ తెలిసుండకపోవచ్చు. కానీ .. ఇప్పుడు దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది. తలైవర్ బీజేపీలో చేరబోతాడా అన్న అంశంపై. 2024 పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కమలనాధులు .. తమిళనాడులో అత్యధిక స్ధానాలు సాధించాలంటే తలైవర్ అస్త్రం ఒక్కటే మార్గమని భావిస్తున్నారు. ఆయను రంగంలోకి దింపితే అనుకున్నది సాధించడం సులభం అవుతుందన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే రజనీకి గవర్నర్ గిరి అప్పగించాలన్న యోచన కూడా చేస్తున్నారు. అయితే ఇందుకు రజనీ అంగీకరిస్తారా ? లేక ఇప్పటికే ఇద్దరి మధ్య ఓ అంగీకారం కుదిరిందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఇప్పటి రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేయకుండా ఉండడానికి కారణం కూడా తెరవెనుక బీజేపీ నడిపిన మంత్రాంగమే అన్న ప్రచారం కూడా ఉంది.

బీజేపీతో రజనీకి ఎంతోకాలంగా అనుబంధం ఉంది. నరేంద్ర మోదీ.. రజనీకాంత్ మధ్య ఎప్పటి నుండి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఇంతకు ముందు చైన్నై పర్యటనకు వచ్చిన మోదీ నేరుగా రజనీకాంత్ ఇంటికి వెళ్ళి చాలా సేపు ఆయనతో గడిపారు. ఎంతోకాలంగా ఆయనను పార్టీలోకి రావాలని మోదీ ఆహ్వనిస్తూనే ఉన్నారన్న ప్రచారం కూడా ఉంది. కానీ.. బీజేపీలో చేరే అంశంపై రజనీ ఎంతో ఆలోచన చేశారు. అటు పార్టీ పెట్టడమా.. లేక బీజేపీలో చేరడమా అన్నది నిర్ధారించుకోలేక పోయారు. పార్టీ పెట్టి చేతులు కాల్చుకునే కంటే మిన్నకుండడం మంచిదన్న భావనకు కూడా వచ్చారు. తాను పార్టీ పెట్టే ఆలోచనను విరమించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ బీజేపీ నుండి పెద్ద ఎత్తున ఒత్తిడులు వస్తున్నాయి. గవర్నర్ పదవి అంటే ఏ పార్టీలోనూ చేరే అవకాశాలు ఉండవు కనుక ఆయన అంగీకరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. రజనీ తన నిర్ణయాన్ని ప్రకటిస్తే అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది కూడా అంచనా వేస్తున్నారు.

రజనీ రాజకీయాల్లోకి వచ్చినా .. లేక గవర్నర్ పదవి పొందినా .. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పినట్టే. రోబో సినిమా తర్వాత ఆయన నటించిన సినిమాలు ఎన్నో వచ్చాయి. అన్నీ పెద్దగా ఆడలేక పోయాయి. ఓపెనింగ్ కలెక్షన్స్ బాగానే ఉన్నా .. పేట, దర్బార్, పెద్దన్న సినిమాలు అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాయి. ఇప్పుడు చేతిలో ఒకటి రెండు సినిమాలు ఉన్నాయి. వాటి పరిస్ధితి ఏంటి అన్నది సందిగ్ధంలో పడింది. ఉన్న ప్రాజెక్ట్ లను కంప్లీట్ చేసి .. రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా.. లేక ఇంకా సెట్ మీదకు వెళ్ళని సినమాలను రద్దు చేసుకుంటారా అన్నది కూడా అనుమానంగా మారింది. మొత్తానికి తలైవర్ కు గవర్నర్ గిరి అన్నది తమిళనాట పెద్ద సంచలన వార్తగా మారింది. బీజేపీ ఒత్తిడికి తలొగ్గి పదవికి దగ్గరవుతారా ? లేక అసలు రాజకీయాలకు దూరంగా ఉంటారా ? అన్నది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.

