తీరు మారకపోతే ఇబ్బందులు పడతారు
నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో హైడ్రా అనుసరిస్తున్న తీరుపై మరోసారి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవో 99కు విరుద్ధంగా వెళితే దాన్ని రద్దు చేసి హైడ్రాను మూసివేయడానికి ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. కేవలం పత్రాలను చూసి హక్కులను ఎలా తేలుస్తారని, హక్కులు నిర్ణయించే అధికారం ఎక్కడుందని నిలదీసింది. చట్టప్రకారం కూల్చివేతలు చేపట్టాలని ఎన్నిసార్లు చెప్పినా తీరు మారదా అంటూ ప్రశ్నించింది.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముతంగి గ్రామంలో తన స్థలానికి సంబంధించి సమర్పించిన వివరాలను పరిశీలించకుండా షెడ్‌ను కూల్చి వేయడాన్ని సవాలు చేస్తూ ప్రవీణ్ అనే వ్యక్తి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. పార్క్ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారంటూ గాయత్రి మెంబర్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. 2023 నవంబరు 15న పంచాయతీ అనుమతులు మంజూరు చేసిందన్నారు. పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన అనుమతులను రద్దు చేశారని హైడ్రా తరపు న్యాయవాది కటిక రవీందర్ రెడ్డి కోర్టుకు తెలిపారు.