Home Page Sliderhome page sliderTelangana

నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తనపై చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తోసిపుచ్చారు. కరీంనగర్ సీపీ గౌస్ ఆలం ఇతర మతాల వారిని తన మతంలోకి మారుస్తున్నారని తాను ఎక్కడా అనలేదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాకుండా, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన సవాల్ విసిరారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

వీణవంక సమ్మక్క జాతరలో తన కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకునే క్రమంలో పోలీసులతో తలెత్తిన వివాదంపై కౌశిక్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఐపీఎస్ అధికారుల సంఘం చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఐపీఎస్ అసోసియేషన్ నేతలు తనకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో అసెంబ్లీలో వారిపై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతానని హెచ్చరించారు.కాగా, ఈ వ్యవహారంపై ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల సంఘాలు ఇప్పటికే ఘాటుగా స్పందించాయి. కౌశిక్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే నిరాధార ఆరోపణలు చేస్తూ ఒక అధికారి మతాన్ని ప్రస్తావించారని ఐపీఎస్ అసోసియేషన్ కార్యదర్శి సిక్రమ్ సింగ్ మాన్, ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి జయేశ్ రంజన్ మండిపడ్డారు.

చట్టబద్ధమైన విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని, దీనిపై శాసనసభ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే విసిరిన తాజా సవాల్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.