కోహ్లి ఉంటే అంతే..
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి ఉన్నాడంటే స్టేడియం కళకళలాడాల్సిందే. తాజాగా ఢిల్లీ తరపున కోహ్లి రంజీ మ్యాచ్ ఆడుతుండడంతో ఢిల్లీ క్రికెట్ సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. దేశవాళీ మ్యాచ్‌కు కూడా కోహ్లీని చూసేందుకు దాదాపు 10 వేల మందికి పైగా వస్తారనే అంచనా వేస్తే, నిర్వాహకుల కళ్లు చెదిరేలా భారీగా జనం తోసుకువచ్చారు. దీనితో అరుణ్ జైట్లీ మైదానంలో 16 వ గేట్ వద్ద ఫ్యాన్స్ మధ్య తొక్కిసలాట మొదలయ్యింది. నెట్టుకుంటూ ముందుకు వెళ్లడంతో చాలామంది షూస్, చెప్పులు వదిలేశారు. ముగ్గురు గాయపడ్డారు. వారిలో ఒక భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. ఒక పోలీస్ బైక్ కూడా ధ్వంసమయ్యింది. పోలీసులు కలిగించుకుని పరిస్థితిని చక్కదిద్దారు. అన్ని గేట్లూ తెరవకుండా 3 గేట్లను మాత్రమే తెరవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఆధార్ కార్డులు తెచ్చుకోవాలని సూచించినప్పటికీ అభిమానుల తాకిడి వల్ల చెక్ చేయకుండానే అనుమతిస్తున్నారు. ఈ రంజీ ట్రోఫీలో ఢిల్లీ టీమ్, రైల్వేస్ టీమ్‌తో తలపడుతోంది. అయితే టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోవడంతో కోహ్లి బ్యాటింగ్ చూడాలని వచ్చిన అభిమానులు నిరాశ చెందారు.

