కేసీఆర్ 3వ సారి ముఖ్యమంత్రి అయితే ఆస్తులు మిగలవు
ఆసిఫాబాద్: కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కితే ఒక్కో వ్యక్తిపై ఇప్పుడున్న అప్పు రెట్టింపు కాక తప్పదు. అప్పుడు ప్రజలంతా ఆస్తులు అమ్ముకోవాల్సిందే అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎన్నికల స్టార్ కేంపెయినర్ బండి సంజయ్ పేర్కొన్నారు. శుక్రవారం సిర్పూర్ (టి)లో నిర్వహించిన విజయ సంకల్ప యాత్ర సభలో బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్‌బాబుతో కలిసి ఆయన మాట్లాడారు. సిర్పూర్ పేపర్ మిల్లులో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని, స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అండతో ఇతర రాష్ట్రాలకు చెందిన వారినే తీసుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ అభ్యర్థి హరీష్‌బాబును గెలిపిస్తే కేంద్రం నుండి ప్రత్యేక నిధులు తెచ్చి మిల్లును నష్టాల నుండి లాభాలబాట పట్టిస్తామన్నారు. టీ అమ్ముకున్న వ్యక్తి ప్రధాని కావడంతో, పేదోళ్ల కష్టాలు తెలుసు కాబట్టే ప్రధాని మోడీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.

