‘కేసీఆర్ కి 6 ఏళ్లు పడితే.. రేవంత్ కి మూడు నెలలే’…ఈటల
‘రేవంత్ రెడ్డి అధికారం నెత్తికి ఎక్కి ఎవరినీ లెక్కజేయని స్థాయికి ఎదిగిండు. కేసీఆర్ కి 6 ఏళ్లు పడితే.. రేవంత్ కి మూడు నెలలే పట్టింది’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్. ఇందిరాపార్క్ వద్ద రైతుహామీల సాధన సదస్సులో పాల్గొని, మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మోసానికి దగాకు మారుపేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. బిల్డర్ల దగ్గర డబ్బులు వసూలు చేసి హైకమాండ్ కి డబ్బులు పంపడానికి, మూసీ ప్రక్షాళన పేరుతో లక్షన్నర కోట్లలో వచ్చే కమీషన్ కోసం హైడ్రాను బూచిగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. దమ్ముంటే రుణమాఫీ చెయ్యి, రైతుబందు ఇవ్వు. దమ్ముంటే ఆరు గ్యారంటీలు అమలు చేయు. కానీ ఇలా పేదల ఉసురు పోసుకోవద్దు అంటూ హితవు చెప్పారు. రైతులకు అండగా ఉండేందుకే ఈ రోజు దీక్ష చేస్తున్నాం. రుణమాఫీ చేయకుంటే నీ భరతం పట్టుడు ఖాయం. హైడ్రా పేరిట డ్రామా చేస్తూ పేదల ఇళ్లను కూలుస్తున్నారు..మా పక్షాన కూడా దీక్ష చేయండి అని అడుగుతున్నారు. మూసీ ప్రక్షాళన చేస్తా అని మాట తప్పిన BRS కు చిత్తశుద్ధి లేదు మీరే కొట్లాడాలి అని ప్రజలు కోరుతున్నారన్నారు. నీ ఉద్దేశ్యం మూసీ ప్రక్షాళన కాదు.

ఎవడబ్బ సొమ్ము.. మా ఇల్లు గుంజుకోవడానికి నువ్వు ఎవరు ? హుస్సేన్ సాగర్ జలవిహార్, ప్రసాద్ ఐమ్యాక్స్, ప్యారడైజ్ ఎవరు కట్టారు? అవి వదిలిపెట్టి పేదల కొంపలు కూల్చే అధికారం నీకు ఎవడు ఇచ్చాడు ? అంటూ ప్రశ్నించారు. 50 రోజులుగా మేము చేసిన ప్రజాపోరాటానికి ఈరోజు హైకోర్టు స్పందించింది. ఈరోజు శుభదినం. హైకోర్టు తప్పు పట్టింది అధికారులను కాదు రేవంత్ రెడ్డిని. రోషం ఉంటే దిగిపో..అంటూ సవాల్ చేశారు.