NewsTelangana

లిఫ్ట్‌ ఇస్తే.. ఇంజక్షన్‌తో చంపాడు..!

ఖమ్మం జిల్లాలో ఇంజక్షన్‌ హంతకుడు హల్‌చల్‌ చేస్తున్నాడు. బైక్‌పై లిఫ్ట్‌ ఇచ్చిన పాపానికి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దుండగుడు ఏకంగా లిఫ్ట్‌ ఇచ్చిన వ్యక్తికే ఇంజక్షన్‌ ఇచ్చి పారిపోయాడు..! ముదిగొండ మండలం బాణాపురంలో ఈ దారుణం జరిగింది. చింతకాని మండలం బొప్పారానికి చెందిన షేక్‌ జమాల్‌ సాహెబ్‌ (40) భార్యను తీసుకొచ్చేందుకు బైక్‌పై వెళ్తుండగా వల్లభి గ్రామం వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్‌ అడిగాడు. జమాల్‌ లిఫ్ట్‌ ఇవ్వడంతో బైక్‌ ఎక్కిన దుండగుడు కొంత దూరం వెళ్లగానే వెనక నుంచి జమాల్‌కు ఇంజక్షన్‌ ఇచ్చాడు. జమాల్‌ బైక్‌ ఆపగానే దుండగుడు పారిపోయాడు. తనకు ఇంజక్షన్‌ ఇచ్చిన విషయాన్ని భార్యకు ఫోన్‌లో తెలిపిన జమాల్‌ వెంటనే స్పృహ కోల్పోయాడు. స్థానికులు 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా జమాల్‌ దారిలోనే ప్రాణాలు కోల్పోయాడు. సంఘటనా స్థలంలోనే ఇంజక్షన్‌, సిరంజి ఉందని స్థానికులు తెలిపారు. కేసును ముదిగొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.