Breaking NewsHome Page Sliderhome page sliderNewsPoliticsTelanganaviral

పదేళ్లు అవకాశం ఇస్తే … ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తాం

కాంగ్రెస్ ప్రభుత్వానికి పదేళ్లు అవకాశం ఇస్తే ఫ్యూచర్ సిటీని ఫ్రపంచం ఆశ్చర్యపోయేలా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు . కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తామని చెబుతున్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి శనివారం సీఎం శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్‌పేటలో పునాది రాయి వేసిన తరువాత రావిర్యాల నుంచి ఆమనగల్ వరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్-1 నిర్మాణానికి భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విజయదశమి రాష్ట్ర ప్రజలకు అన్ని విజయాలను చేకూరుస్తుందని అన్నారు. అలాగే చాలా మంది కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని, ఫ్యూచర్ సిటీ లో తనకు భూములు ఉన్నాయని, నగరం కట్టుకుంటున్నాడని ఆరోపిస్తున్నారని, తనకు ఎటువంటి భూములు ఉన్నా అందరికీ కనిపిస్తాయని దాచిపెడితే దాగవని అన్నారు.

కుతుబ్ షాహీలు హైదరాబాద్ నగరానికి పునాది వేశారని, వైఎస్సార్‌, చంద్రబాబు ఆ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆ నాయకులు దూరదృష్టితో ఆలోచించకపోయుంటే, నేడు హైదరాబాద్ ప్రపంచ స్థాయిలో పోటీ పడే స్థాయికి వచ్చేది కాదని, ఓఆర్ఆర్‌, శంషాబాద్‌, హైటెక్ సిటీ లాంటి ప్రాజెక్టులు అసాధ్యమయ్యేవని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి పదేళ్ల అవకాశం ఇస్తే హైదరాబాద్‌ను న్యూయార్క్‌, దుబాయ్‌లకు పోటీగా తీర్చిదిద్దుతామని , న్యూయార్క్‌లో ఉన్న వారు కూడా ఫ్యూచర్ సిటీకి వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. మనం ఎందుకు ఫ్యూచర్ సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించకూడదని ప్రశ్నించారు.
ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు ప్రత్యక్ష కనెక్టివిటీ కల్పిస్తున్నామని, అలాగే ఫ్యూచర్ సిటీకి బుల్లెట్ ట్రైన్‌ రప్పించేందుకు కేంద్రాన్ని ఒప్పించామని తెలిపారు. అమరావతి నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభం అవుతుందని, ఆ మార్గంలో ఫ్యూచర్ సిటీ కూడా అనుసంధానం కానుందని చెప్పారు.
చిన్న చిన్న సమస్యలు తలెత్తినా పరిష్కరించుకోవాలని, కోర్టుల చుట్టూ తిరిగి సమయం వృథా చేసుకోవద్దని, అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.