మత్స్యకారులకు సమస్య వస్తే నాకు వచ్చినట్లే
ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. ఇవాళ ఉప్పాడ మత్స్యకారులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘మత్స్యకారులకు సమస్య వస్తే నాకు వచ్చినట్లే. మా ఇంట్లోని వారికి సమస్య వచ్చినట్లే భావిస్తాను. అదే భావనతో సమస్యను పరిష్కరిస్తా. ఈ విషయాన్ని అక్టోబరు 9వ తేదీన ఉప్పాడ సెంటర్ నుంచి చెప్పాను. ఇప్పుడు అదే మాట మీద ఉన్నాను. సమస్య వస్తే రాజకీయాలకు అతీతంగా దాని పరిష్కారానికి ముందుకు వెళ్లేవాడిని. నాకు మీ సహకారం కావాలి. నన్ను శంకించకండి.. నేను మీ వాడిని. మిగతా పార్టీల నాయకుల్లా సమస్య వస్తే బూతులు తిట్టడం, గొడవలు పెట్టడం చేయను. పరిష్కారం వచ్చేలా పని చేస్తాను. దాని కోసమే పరితపిస్తాను’ అని పవన్ వ్యాఖ్యనించారు.
సముద్రపు కాలుష్యం చాలా రకాలుగా ఉంటుందని, మత్స్యకారులు ఉప్పాడ తీరంలో కాలుష్య సమస్య నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే దీని మూలాలను శాస్త్రీయంగా వెతికేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టానని పవన్ కల్యాణ్ అన్నారు. ఇప్పుడు డాక్టర్ జో కిజాకూడన్ బృందం రంగంలోకి దిగి ఉప్పాడ తీరంలో కాలుష్య సమస్యపై పూర్తిస్థాయి అధ్యయనం చేస్తుందని తెలిపారు. దీని మూలాలు వెతికి, శాశ్వత పరిష్కారం వెతుకుదామన్నారు. మత్స్యకారులకు ఎలాంటి సమస్యా రాకుండా చూసుకునే బాధ్యతను నేను తీసుకుంటాను.. అని హామీ ఇచ్చారు. పరిశోధన బృందానికి మత్స్యకారులు తగిన విధంగా సహకరించాలని, వారు తీర ప్రాంతంలో అంతా తిరిగి, సముద్రంలోకి వెళ్లి మరీ కాలుష్యానికి అసలు కారణాలను తెలుసుకుంటారని సూచించారు.
అక్టోబరు 9వ తేదీన ఉప్పాడ వేదికగా 100 రోజులు గడువు ఇవ్వాలని మత్స్యకారులను కోరినట్లు తెలిపారు. అప్పటి నుంచి నాతోపాటు నా కార్యాలయ అధికారులు దీనిపై కూలంకషంగా పని చేస్తున్నారన్నారు. సమస్య పరిష్కార దిశగా, మత్స్యకారులకు కొత్త భరోసా ఇచ్చే దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. మత్స్యకారులు మారుతున్న కాలంతో మరింత వేగంగా వారి బతుకులను బంగారు మయం చేసుకునేందుకు వివిధ రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు అవుతున్న పద్ధతులను అవలంబించాలన్నారు. దీనికోసం ఉప్పాడ మత్స్యకారుల నుంచి ప్రత్యేకంగా బృందాలను తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు పంపుతున్నామని అన్నారు. అక్కడి విధానాలను అవగతం చేసుకోవాలని, దానికి ప్రభుత్వం కూడా మీకు తగిన విధంగా సహకరిస్తుందని తెలిపారు. ఉప్పాడలోని 7200 మంది మత్స్యకారులు, 25,600 మంది వారి కుటుంబ సభ్యులకు జీవన భృతి రెట్టింపు అవ్వాలన్నదే లక్ష్యమని అన్నారు.

