‘ఇప్పుడు ఎన్నికలు వస్తే ప్రజలు ఫుట్‌బాల్ తన్నిన్నట్లు తంతారు..జగన్
‘ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు పరిపాలనతో విసిగిపోయారని, ఇప్పుడు కానీ ఎన్నికలు వస్తే ప్రజలు ఫుట్‌బాల్ తన్నిన్నట్లు తంతారని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించారు. నేడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో భేటీ అయ్యారు. వారితో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తూ కూటమి పరిపాలనపై విమర్శలు కురిపించారు. “ఏ ప్రభుత్వంపైనైనా వ్యతిరేకత రావాలంటే కనీసం రెండేళ్లైనా పడుతుంది, కానీ చంద్రబాబు పరిపాలనపై ప్రజలకు నెలల్లోనే విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. మెజార్టీ లేకపోయినా కొన్నిచోట్ల గెలిచినట్లు ప్రకటించుకున్నారు. ఒక పార్టీ గుర్తుమీద గెలిచి, ముఖ్యమంత్రి బెదిరింపుల వల్ల పార్టీలు మారిపోతున్నారు. పోలీసులను పెట్టి కార్యకర్తలను బెదిరిస్తున్నారు. వైసీపీ పార్టీలాగ ప్రతీ ఇంటి గడపకు వెళ్లే ధైర్యం టీడీపీకి ఉందా, ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. వైసీపీ కన్నా ఎక్కువ పనులు చేస్తాం అని ప్రజలను ప్రచారంలో నమ్మించారు. హామీల అమలు మాత్రం జరగడం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థతి లేదు. మనకూ టైం వస్తుంది. అప్పుడు వాళ్లకు సినిమా చూపిస్తాం” అంటూ మండిపడ్డారు. ‘ప్రజల తరపున గట్టి పోరాటాలు చేద్దాం, వచ్చేది మన ప్రభుత్వమే, మంచి రోజులు వస్తాయి’ అంటూ ధైర్యం చెప్పారు.

