Breaking Newshome page sliderHome Page SliderNewsPoliticsTelanganaviral

కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా

తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రకటించారు. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేసిన “బీజేపీ ఎనిమిది ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారు” అన్న వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. అలాంటి ఆరోపణలు కరీంనగర్ ప్రజలతో పాటు మొత్తం ఎనిమిది నియోజకవర్గాల ప్రజల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చారని, ప్రస్తుతం ఆరు గ్యారంటీలపై ప్రజలు ఆగ్రహంతో రాళ్లు తీసి కొట్టే పరిస్థితి ఉందని మండిపడ్డారు.

మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, పింఛన్లు పెంచుతామని చెప్పి మాట తప్పారని, నిరుద్యోగ భృతి హామీని మరిచిపోయారని ఆయన ఆరోపించారు. అంతేకాదు, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ఒక్క తులం బంగారం, స్కూటీల వాగ్దానాలు ఏవీ నెరవేర్చలేదని విమర్శించారు. 20 నెలలు పూర్తయ్యాక కూడా గ్రామ పంచాయతీలకు ఒక్క పైసా కూడా విడుదల చేయని ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. మహేశ్ కుమార్ గౌడ్ తనను ఒకప్పుడు బీసీ అని పిలిచి పొగిడారని, ఇప్పుడు తాను బీసీ కాదంటూ హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారని బండి సంజయ్ సెటైర్లు వేశారు. “అతనిని చూస్తే నాకు గజినీ సినిమా గుర్తుకొస్తుంది” అంటూ వ్యాఖ్యానించారు.