ఉప ఎన్నిక వస్తే మళ్లీ గెలుస్తా.
రాజీనామా అంశంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.హిమాయత్‌నగర్ డివిజన్ కార్యకర్తలతో శనివారం జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉప ఎన్నికలకు వెళ్లేందుకు తనకు పూర్తి స్థాయి ధైర్యం ఉందని, అది తన కార్యకర్తలు ఇచ్చిన బలమేనని దానం స్పష్టం చేశారు. కార్యకర్తల అండదండలతోనే తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించానని, ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చినా తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇదే సందర్భంలో బీఆర్‌ఎస్ నాయకులపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వడం బీఆర్‌ఎస్ నేతలు విస్మరించారని, సీఎంను ఏకవచనంతో సంబోధిస్తూ అగౌరవంగా మాట్లాడటం తగదని మండిపడ్డారు. విమర్శలు చేసే క్రమంలో సంయమనం పాటించాలని, లేనిపక్షంలో ప్రతివిమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని దానం నాగేందర్ హెచ్చరించారు.

