నేను రాజీనామా చేయను..!
మైసూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి స్పందించారు. తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాను మనస్సాక్షి ప్రకారం మాత్రమే పని చేస్తానని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రిజైన్ చేయాల్సిన పని లేదన్నారు. ఈడీ, ఇతర సంస్థల దర్యాప్తుతో సంబంధం లేకుండా, సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈడీ, మరేదైనా సంస్థ విచారణ జరిపినా న్యాయపరంగా పోరాడుతానని వ్యాఖ్యానించారు. 14 ఫ్లాట్లను వదులుకోవాలని సిద్ధరామయ్య భార్య ముడాకు లేఖ రాయడంపై స్పందిస్తూ.. ఆ భూమిని నా భార్య సోదరుడు ఆమెకు బహుమతిగా ఇచ్చాడని ముడా దానిని ఆక్రమిస్తే, దీనికి ప్రత్యామ్నాయ స్థలం కావాలని కోరినట్టు తెలిపారు. ముడా స్కామ్ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయాలనే వైఖరిని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హోంమంత్రి జీ పరమేశ్వర తెలియజేశారని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఆరోపించారు. ఈ క్రమంలో దీనిపై సిద్ధరామయ్య క్లారిటీ ఇచ్చారు.