Andhra PradeshNews

రాజకీయాల కోసం సినిమాలను ఎప్పటికీ వదులుకోను- చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా IFFIలో మెగాస్టార్ చిరంజీవిని ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించారు. అవార్డు అందుకున్న తర్వాత 67 ఏళ్ల సూపర్ స్టార్ సినీ పరిశ్రమకు, తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. అద్భుతమైన అవార్డును, గొప్ప గౌరవాన్ని అందించినందుకు IFFI, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు చిరంజీవి. కొన్ని గుర్తింపులు ప్రత్యేకమైనవి, ఈ అవార్డు అలాంటిదేనన్నారు. మధ్యతరగతి కుటుంబంలో, సామాన్య తల్లిదండ్రులకు పుట్టానని చిరంజీవి చెప్పుకొచ్చారు. నా కీర్తి, పేరు, చరిష్మా, అన్ని అధికారాలు, నా అభిమానుల అమూల్యమైన ప్రేమ, ఆప్యాయతకు, చిత్ర పరిశ్రమకు రుణపడి ఉంటానన్నారు. మా తల్లిదండ్రులకు కొణిదెల శివశంకర వర ప్రసాద్‌గా పుట్టి, మళ్లీ చిరంజీవిగా సినీ పరిశ్రమలో పుట్టానన్నారు చిరంజీవి.

రాజకీయాల్లో తన ఆకాంక్షలను కొనసాగించేందుకు నటనకు స్వస్తి చెప్పాలని గతంలో నిర్ణయం తీసుకున్నానన్నారు. తన జీవితంలో మళ్లీ అది పునరావృతం చేయబోనని తాజాగా చిరంజీవి ప్రతిజ్ఞ చేశారు. IFFI 2022 ముగింపు వేడుకలో, రాజకీయాల కోసం సినిమాలను ఎప్పటికీ వదులుకోనని చిరంజీవి ప్రతిజ్ఞ చేశారు. తెలుగు సినిమా అభిమానుల ప్రేమకు తాను బానిసననన్నారు చిరు. చిత్ర పరిశ్రమలో 45 ఏళ్లుగా ఉన్నాను. ఈ నాలుగైదు దశాబ్దాలలో నేను ఒక దశాబ్దం రాజకీయాల్లోనే గడిపాను. కొన్ని కారణాల వల్ల మళ్లీ సినిమా ఇండస్ట్రీకి వచ్చానన్నారు. మళ్లీ ఎంట్రీ ఇచ్చాక ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్న సందేహం ఉండేదన్నారు. కానీ వారు నాపై అదే రకమైన ప్రేమ, ఆప్యాయతలను కురిపిస్తారా అన్న అనుమానం ఉండేదనన్నారు. తరం మారిపోయింది కాబట్టి నాకు అనుమానం వచ్చిందన్నారు. ఐతే వారి హృదయాలలో ప్రేమ, ఆప్యాయత, నా స్థానం చెక్కుచెదరకుండా ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయాయనన్నారు. అభిమానులతో నాకున్న అనుబంధం అది అని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. సినిమా పరిశ్రమను ఎన్నటికీ మళ్లీ వదిలిపెట్టనని అభిమానులకు హామీ ఇస్తున్నానన్నారు. చిరంజీవి వార్తేరు వీరయ్యతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.