నేను తపస్సుకు పోతా..సెక్యూరిటీ వద్దు..
శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. తనకు గత వైసీపీ ప్రభుత్వం కల్పించిన భద్రతా సిబ్బందిని వెనక్కు తీసుకోవాలని కోరారు. ఇప్పటివరకూ తనకు రక్షణ కల్పించినందుకు టీడీపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై తాను విశాఖలో ఉండనని, రిషికేశ్‌లో తపస్సు చేసుకుంటూ గడుపుతానని పేర్కొన్నారు. గత ముఖ్యమంత్రి జగన్ ఆయనకు నెలకు రూ.20 లక్షల ఖర్చుతో సెక్యూరిటీని ఏర్పాటు చేశారని, ఒక స్వామీజీకి అంత సెక్యూరిటీ ఎందుకని, ప్రభుత్వం ఎందుకు భద్రత కల్పించాలని గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే వైసీపీ ప్రభుత్వం శారదాపీఠానికి కేటాయించిన 15 ఎకరాల భూమిని కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. విశాఖ వద్ద రూ.225 కోట్ల విలువైన 15 ఎకరాలను గత ప్రభుత్వం రూ.15 లక్షలకే కేటాయించిందని కూటమి నేతలు ఆరోపించారు. ఈ పరిణామాల మధ్య స్వరూపానంద వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.


 
							 
							