అందరికీ సొంత వ్యక్తి
రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజును ‘అన్నగారు’ అని పిలిచేవాడినని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. శుక్రవారం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో క్షత్రియ సంఘం నిర్వహించిన కృష్ణంరాజు సంతాప సభలో రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు. కృష్ణంరాజు దశదిన కర్మ రోజు వద్దామనుకున్నానని, బిజీ షెడ్యూల్ వల్ల ఈ రోజు వచ్చానని తెలిపారు. బాహుబలి సినిమా చూడాలని కృష్ణంరాజు కోరారని గుర్తు చేశారు.

బాహుబలి సినిమా చూశా..
తన ఫ్యామిలీ, కృష్ణంరాజు ఫ్యామిలీ కలిసి బాహుబలి సినిమా చూశామని చెప్పారు. ఆ సినిమా చాలా బాగుందని, కృష్ణంరాజు తనకు మంచి స్నేహితుడని తెలిపారు. కృష్ణంరాజు తెలుగు ప్రజలకు రాజకీయ నాయకుడు, సినిమా స్టార్, రెబల్ స్టార్.. స్వగ్రామంలో మాత్రం ఆయన అందరికీ సొంత వ్యక్తి అని వెల్లడించారు. గ్రామంలో ప్రతి ఒక్కరిని కృష్ణంరాజు గుర్తు పడతారని, అందరినీ పేరుతో పిలుస్తారని గుర్తు చేశారు.

గోహత్య నిషేధంపై తొలి బిల్లు..
గోహత్య నిషేధంపై పార్లమెంటులో తొలి బిల్లును కృష్ణం రాజు ప్రవేశపెట్టిన విషయాన్ని రాజ్‌నాథ్ సింగ్ గుర్తు చేశారు. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన రాజ్‌నాథ్ సింగ్ నేరుగా కృష్ణంరాజు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభాస్‌కు, కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవికి, కుమార్తెలకు ధైర్యం చెప్పారు. రాజ్‌నాథ్ వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ ఉన్నారు. కృష్ణంరాజు అనారోగ్యం, చికిత్స తీసుకున్న విషయాలను రాజ్‌నాథ్‌కు లక్ష్మణ్ వివరించారు.