అనవసరంగా కెలికా…సారీ !
భారతీయ సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. బాలీవుడ్‌లో మతపరమైన వివక్ష ఉందంటూ ఆయన చేసినట్లుగా ప్రచారం జరిగిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో, రెహమాన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆదివారం ఒక వీడియోను పోస్ట్ చేస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
“భారతదేశం నా ఇల్లు, నా ప్రేరణ మరియు నా గురువు. ఎవరి మనోభావాలనూ గాయపరచాలన్న ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు,” అని రెహమాన్ పేర్కొన్నారు. తన ఉద్దేశాలు కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకోబడతాయని, ప్రజలు తన నిజాయితీని గ్రహిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తాను భారతీయుడిని కావడం ఎంతో గర్వంగా ఉందని, వివిధ సంస్కృతులను సంగీతం ద్వారా ఏకం చేయడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
తన సంగీత ప్రయాణంలో భారత్ ఇచ్చిన స్వేచ్ఛను ఆయన కొనియాడారు. నాగ సంగీతకారులతో స్ట్రింగ్ ఆర్కెస్ట్రా, సన్ షైన్ ఆర్కెస్ట్రా, అలాగే రామాయణం ప్రాజెక్ట్ కోసం హన్స్ జిమ్మెర్‌తో కలిసి పని చేయడం వంటి అనుభవాలను ఈ వీడియోలో గుర్తుచేసుకున్నారు. “నా సంగీతం ఎల్లప్పుడూ గతాన్ని గౌరవిస్తుంది, వర్తమానాన్ని వేడుక చేసుకుంటుంది మరియు భవిష్యత్తుపై ఆశను కలిగిస్తుంది” అని ఆయన భావోద్వేగంగా చెప్పారు.
ఇటీవల బిబిసి నెట్‌వర్క్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో తనకు అవకాశాలు తగ్గడంపై స్పందించారు. “సృజనాత్మక నిర్ణయాలు కొన్నిసార్లు సృజనాత్మకత లేని వ్యక్తుల చేతిలో ఉంటున్నాయి. అది మతపరమైన కారణాల వల్ల కూడా కావచ్చు,” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మాటలు బాలీవుడ్‌లో మత వివక్ష ఉందన్న కోణంలో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. దీనిపై ఇప్పుడు ఆయన స్పష్టత ఇస్తూ.. సంగీతం ఎవరినీ బాధపెట్టదని, అది కేవలం సంస్కృతులను కలిపే వారధి మాత్రమేనని వివరణ ఇచ్చారు.

