తెలంగాణ వదిలి వెళ్లిపోవాలి… గవర్నర్‌కు వార్నింగ్
ప్రధాని తెలంగాణ పర్యటన వెనుక పెద్ద కథే కనిపిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ నెల 12న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి మోడీ రానున్నారు. ప్రధాని టూర్‌కు సంబంధించిన ఏర్పాట్లలో బీజేపీ శ్రేణులు బిజీ బిజీగా వున్నారు. మునుగోడు ఎన్నిక తరువాత విజయం సాధించి ఈ ఫ్యాక్టరీ ప్రారంభం చేద్దామనేది అసలు ప్లాన్ అని అన్నారు కూనంనేని. కానీ, బీజేపీ ఓటమి పాలైందన్నారు. అయినా.. గతేడాది ప్రారంభమైన ఫ్యాక్టరీని ఇప్పుడు ప్రారంభించడం ఏంటని ప్రశ్నాంచారు. తాము ఏదో చేశామని అంతా బీజేపీ ఖాతాలో వేసుకోవాలన్నదే ప్లాన్‌గా కనిపిస్తోందన్నారు. 8 సంవత్సరాల్లో రాష్ట్రానికి ఏం చేశారని దుయ్యబట్టారు. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీ అయినా నేరవేర్చరా అని నిలదీశారు కూనంనేని. ప్రధాని తెలంగాణకు రావద్దని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని అన్నారు.
గవర్నర్ వ్యవస్థపై కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులను తన ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటున్నానని గవర్నర్ అన్నారని తెలిపారు సాంబశివరావు. మీరు గవర్నరా.. లేక బీజేపీ కార్యకర్తనా.. ముందు తేల్చాలన్నారు. తమిళనాడు, కేరళ, ఢిల్లీ, తెలంగాణలో గవర్నర్‌ల తీరు సరిగా లేదని అన్నారు. గవర్నర్‌ల వ్యవస్థ సరిగా లేదని, బ్రిటీష్ కాలం నుంచి వచ్చిన ఈ గవర్నర్ వ్యవస్థని రద్దు చేయాలన్నారు. జాతీయ మహాసభల్లో కూడా తీర్మానం చేస్తామన్నారు. తమిళిసై తెలంగాణ వదిలి వెళ్లిపోవాలని.. త్వరలో భారీ ఎత్తున రాజ్ భవన్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు కూనంనేని సాంబశివరావు.

