Home Page SliderInternational

“నా దేవుడిని కలిసాను”- రాజమౌళి ఉద్వేగం

ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్‌ను, పాన్ ఇండియా దర్శకుడు, రాజమౌళి కలిసారు. ఆర్ ఆర్ ఆర్ టీమ్ అంతా ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డుల ప్రధానోత్సవానికి కుటుంబాలతో సహా హాజరయ్యారు. ‘నాటునాటు’ పాటకు ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు అందుకున్న కీరవాణితో పాటు దర్శక ధీరుడు రాజమౌళి కూడా యూనివర్సల్ పార్టీకి హాజరయ్యారు. అక్కడ హాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వారిలో జక్కన ఎంతగానో అభిమానించే స్పిల్‌బర్గ్‌ను వీరిద్దరూ తొలిసారి కలిసారు. ఆయనతో దిగిన కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ రాజమౌళి “నేను నా దేవుడిని ఇప్పుడే కలిసాను” అంటూ తన అభిమానాన్ని చాటుకున్నారు. ఆయనను  ‘గాడ్ ఆఫ్ మూవీస్’ అని పిలుస్తారని,ఆయన సినిమాలంటే తనకెంత ఇష్టమో ఆయనతో చెప్పానని వివరించారు. కీరవాణి కూడా ఈ విషయాన్ని పోస్టు చేస్తూ ఆయనకు “నాటునాటు” పాట చాలా నచ్చిందని చెప్పారని, తనకెంతో సంతోషంగా ఉందని చెప్పారు.

స్పీల్‌బర్గ్ ‘జురాసిక్ పార్క్’ చిత్రం ఎంత సంచలనం సృష్టించిందో మనకు తెలుసు. ‘ది టర్మినల్’, ‘హుక్’, ‘ది పోస్ట్’ వంటి గొప్ప చిత్రాలు కూడా ఆయన దర్శకత్వంలో వచ్చినవే. ఈ యూనివర్సల్ పార్టీని ఆస్కార్ ఓటింగ్‌లో భాగంగా లాస్ ఏంజెల్స్‌ లోని సన్‌సెట్ టవర్స్‌ లో ఏర్పాటు చేసారు. ఈ వేడుకలో హాలీవుడ్ స్టార్లందరూ పాల్గొన్నారు. భారత్ నుండి 10 చిత్రాలు ఆస్కార్ కోసం పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ‘నాటునాటు’ పాట ఆస్కార్ షార్ట్ లిస్ట్ కు ఎంపికైంది. వివిధదేశాల నుండి వచ్చిన చిత్రాలను ఓటింగ్ ద్వారా నామినేషన్స్‌ కు ఎంపిక చేస్తారు. వాటిని జనవరి 24 వతేదీన ప్రకటించబోతున్నారు. మార్చి 12 న అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది.