మాల్దీవులు వద్దనే వద్దు..ఇండియా బీచ్‌లు ముద్దు..!
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్ దీవులను సందర్శించిన తర్వాత మాల్దీవులకు చెందిన ముగ్గురు జూనియర్ మంత్రులు ఆయనపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడంతో భారత్-మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రధాని మోదీ లక్షద్వీప్‌లోని సహజమైన బీచ్‌లను ఆస్వాదించి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం ద్వారా మొదలైన రచ్చ కొనసాగుతోంది. మోదీ పర్యటన తర్వాత భారతీయులు పెద్ద ఎత్తున లక్షద్వీప్‌పై ఇంట్రెస్ట్ కనబర్చారు. ప్రధాని మోదీ పోస్ట్‌లకు స్పందన చూసి మాల్దీవుల మంత్రులు, ప్రధానిని ఎగతాళి చేశారు. భారతదేశం మాల్దీవులతో ఎప్పటికీ పోటీపడలేదంటూ తీవ్రపదజాలంతో దూషించారు. దౌత్యపరమైన గొడవలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఆగ్రహంతో ఉన్న భారతీయులు మాల్దీవుల పర్యటనలను రద్దు చేసుకున్నారు. మోడీ వ్యతిరేక ప్రభంజనం తర్వాత చాలా మంది భారతీయులు… మాల్దీవుల హాలీడే ప్లాన్స్‌ను రద్దు చేసుకున్నారు. ప్రధాని మోదీ పర్యటన, పోస్ట్‌ల నుండి లక్షద్వీప్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ద్వీపసమూహంలో ప్రపంచవ్యాప్తంగా శోధన ఆసక్తి బాగా పెరిగిందని ట్రావెల్ కంపెనీలు పేర్కొన్నాయి.

మాల్దీవుల ఉదంతం తర్వాత అందరి దృష్టి లక్షద్వీప్‌పై పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి దీవులను సందర్శించిన తర్వాత ఇంటర్నెట్‌లో లక్షద్వీప్ కోసం సెర్చ్‌లు 3,400 శాతం పెరిగాయని ఆన్‌లైన్ ట్రావెల్ పోర్టల్ MakeMyTrip తెలిపింది. లక్షద్వీప్ కోసం సెర్చ్‌లు పెరగడంతో మేక్‌మైట్రిప్ ‘బీచ్ ఆఫ్ ఇండియా’ ప్రచారాన్ని ప్రారంభించింది. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనను మాల్దీవుల రాజకీయ నాయకులు అపహాస్యం చేయడంపై వివాదం చెలరేగిన తర్వాత ఈ డెవలెప్మెంట్స్ జరిగాయి. అయితే, ప్రధాని మోదీపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను మాల్దీవుల ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. వారి అభిప్రాయాలకు, ప్రభుత్వానికి సంబంధం లేదంది.

ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన ద్వీపాల్లో లక్షద్వీప్ ఒకటి. కేరళ తీరానికి 220-440 కి.మీ దూరంలో ఈ దీవులున్నాయి. 32 చదరపు కి.మీ విస్తీర్ణంలో 36 ద్వీపాలతో లక్షద్వీప్ విస్తరించి ఉంది. పగడపు దిబ్బలు, గొప్ప సముద్ర సంపద, జీవావరణ శాస్త్రం కారణంగా ద్వీపాలు ఎంతో విశిష్టమైనవని చెప్తారు. లక్షద్వీప్ ద్వీపాలు ఓడ, హెలికాప్టర్, కేరళలోని కొచ్చి నుండి అలియన్స్ ఎయిర్‌లైన్స్ విమానం ద్వారా భారతదేశ ప్రధాన భూభాగానికి అనుసంధానించారు. డిమాండ్ పెరిగేకొద్దీ లక్షద్వీప్‌కు మరిన్ని విమానాలు నడపుతుతున్నారు. ప్రధాని మోదీ షేర్ చేసిన ద్వీపం అందం, సముద్రగర్భంలో స్నార్కెల్లింగ్ దృశ్యాలు సంచలనంగా మారాయి. లక్షద్వీప్‌లో ప్రధాని మోదీ ఒక్కరోజు బస చేయడం వల్ల భారత పర్యాటక మ్యాప్‌లో విశేషమైన స్థానాన్ని దక్కించుకుంది. లక్షద్వీప్‌లోని ప్రతి పౌరుడు చిరకాలంగా కోరుకునేది అదే. పర్యాటకం అభివృద్ధి చెందితే స్థానికులకు ఉపాధి దొరుకుతుందని.. మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతాయన్న విశ్వాసం వ్యక్తమవుతోంది. ఐతే, లక్షద్వీప్‌లో ప్రైవేట్ హోటళ్లు లేవని… అయితే ప్రస్తుతం ఒక హోటల్ దాదాపు 95 శాతం సిద్ధంగా ఉందని లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ చెప్పారు. పర్యాటక రంగానికి తగినట్టుగా విమానరాకపోకలు సిద్ధం చేసి… మౌలిక సదుపాయాలు కల్పిస్తే… లక్షద్వీప్‌ను వివాహ గమ్యస్థానంగా అభివృద్ధి చేయవచ్చని ఫైజల్ అభిప్రాయపడ్డారు.

ఇండియా టూరిజాన్ని డెవలప్ చేయండి… ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసుకోవచ్చన్న సందేశాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అండమాన్, నికోబార్ ద్వీపాలు, లక్షద్వీప్‌లతో సహా 7,516 కి.మీ.ల వరకు కలుపుతూ భారతదేశ తీరప్రాంతం ప్రపంచంలోనే అతి పొడవైనది. ఈ విస్తారమైన తీరప్రాంతంలో ఎన్నో అద్భుతమైన బీచ్‌లు ఉన్నాయి. భారతదేశంలోని తీర ప్రాంతాల గురించి ఆలోచించినప్పుడు గోవా, కేరళ, అండమాన్, నికోబార్ దీవులు మనకు గుర్తుకు వస్తాయి. భారతదేశ తీరప్రాంతంలోని మనందరికీ తెలియని ఎన్నో అద్భుతాలు.. అమోఘాలు… ఉన్నాయి. వాటిని ప్రోత్సహిస్తే దేశం ఎంతగానో ముందడుగేస్తుంది. ఆర్థికంగానూ బలోపేతం అవుతోంది. విదేశాలను పెంచి పోషించాల్సిన అవసరం ఉండదు.

డొమెస్టిక్ టూరిజం సామర్థ్యాన్ని వివరిస్తూ, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ప్రెసిడెంట్ రాజీవ్ మెహ్రా ఇలా అన్నారు. మన దేశంలో గోవా, కేరళ, అండమాన్‌లలో బీచ్ టూరిజం ఉంది, అయితే దీనిని బెంగాల్ వెంట భారతీయ తీరప్రాంతంలో ఇతర ప్రదేశాలలో మెరుగుపరచవచ్చు. ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక హోటళ్లను మెరుగుపరచడం, కొత్తవి నిర్మించడం, ఎయిర్ కనెక్టివిటీ, వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధి చేయడం ద్వారా సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఐతే ఇందుకు దేశీయంగా విమానరంగం చౌకగా లభించాల్సి ఉంది. భారతదేశంలో విమానాలు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత వేసవిలో, మాల్దీవులు, దుబాయ్‌లకు వెళ్లే విమానాలు ధరలు ₹ 18,000 నుంచి ₹ 22,000గా ఉంటే… జూన్ మధ్యలో ముంబై నుండి శ్రీనగర్‌కి ఒక రౌండ్ ట్రిప్ ధర ₹ 26,000 కంటే ఎక్కువ పలికింది. అధిక దేశీయ విమాన టిక్కెట్ ధరల గురించి ఆందోళన చెందుతూ, టూర్ ఆపరేటర్లు తరచూ ప్రభుత్వాన్ని దేశీయ ప్రయాణ ఛార్జీలను తగ్గించాలని వేడుకుంటున్నారు.

అదేవిధంగా, గమ్యస్థానాలలోని హోటళ్లు గత సంవత్సరంలో 15 నుండి 20 శాతం వరకు పెంచాయి. ఇది చాలా మంది భారతీయ పర్యాటకులను థాయ్‌లాండ్, దుబాయ్, మాల్దీవులు వంటి దగ్గరగా ఉన్న గమ్యస్థానాలకు చేర్చింది. గతంలో భారతీయులు మాల్దీవులను ఖరీదైన గమ్యస్థానంగా భావించేవారు. కరోనా తరువాత, మాల్దీవుల పర్యాటకం తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు, ఆ దేశ హోటళ్లు… భారతీయులకు తక్కువ ధరలకు రిసార్ట్‌లను అందుబాటులోకి తెచ్చాయి. బాలీవుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, స్టార్‌లకు ఫోటోలు పోస్ట్ చేయాలనే షరతుతో మాల్దీవులు ఉచిత టూర్లను అందించాయి. అది అక్కడి పర్యాటక రంగానికి అద్భుతంగా అభివృద్ధి చేసింది. లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చుతూ, భారత టూరిజం ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు మెహ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. లక్షద్వీప్‌లో మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ తక్కువగా ఉన్నాయి. మాల్దీవులకు సరిపోయేలా అక్కడ చాలా అభివృద్ధి చేయాలి. తప్పనిసరి పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్లు వంటి ఇతర నియమాలు ఉన్నాయి. దీనికి రెండు వారాలు పడుతుంది. ప్రభుత్వ హోటళ్లలో బస చేసే వారికి ఇవి అవసరం లేదు. ఐతే విమాన ఛార్జీలు కూడా దాదాపు మాల్దీవుల ఛార్జీలతో సమానంగా ఉన్నాయన్నారు.

అదే సమయంలో మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, డిసెంబర్ వరకు అక్కడ సందర్శించేవారిలో భారతీయులు అత్యధికంగా ఉన్నారు. డిసెంబర్ 13 వరకు మొత్తం 17,57,939 మంది పర్యాటకులు ద్వీప దేశానికి చేరుకున్నారు. ఇది 2022లో నమోదైన 1.5 మిలియన్ల మందితో పోలిస్తే 12.6 శాతం ఎక్కువ. మాల్దీవులకు అత్యధిక సంఖ్యలో పర్యాటకులు భారతదేశం నుండి వస్తారు. ఆ తర్వాత స్థానాల్లో రష్యా, చైనా వాసులుంటారు. ఏవియేషన్ డేటా కూడా మాల్దీవులు భారతీయులకు చాలా సంవత్సరాలుగా ప్రసిద్ధ ఎంపిక అని సూచిస్తుంది. 2018 చివరి మూడు నెలల్లో, 51,000 మంది ప్రయాణికులు భారతదేశం-మాల్దీవుల మధ్య ప్రత్యక్ష విమానాలలో ప్రయాణించారు. 2021లో అదే సమయంలో రికార్డు స్థాయిలో 1.15 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు. మాల్దీవులకు వారానికి 48 మంది భారతీయ విమానాలు సర్వీసులు నడుపుతుండగా, మాల్దీవుల విమానాలు 10 సర్వీసులు అందిస్తున్నాయి. మొత్తంగా ఇండియా-మాల్దీవుల మధ్య వారానికి 58 విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఇప్పుడు ఇండియా ఏం చేస్తోందన్నదానిపై ఎంతో ఉత్కంట నెలకొంది. మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలతో ఇప్పటికే ఆ దేశానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో మాల్దీవులతో దీర్ఘకాలంగా పెంపొందించుకున్న బంధాన్ని దెబ్బతీయాలని భారత్ కోరుకోవడం లేదు. అయితే మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ తన ఎన్నికల ప్రచారంలో భారత వ్యతిరేక ప్రచారం చేసి ఎన్నికయ్యాడు.

సంప్రదాయాన్ని ఉల్లంఘిస్తూ, నవంబర్‌లో ప్రమాణ స్వీకారం చేసిన ముయిజ్జూ తన మొదటి అధికారిక పర్యటన కోసం టర్కీకి వెళ్లారు. సాంప్రదాయకంగా, మాల్దీవుల అధ్యక్షులు తమ తొలి అధికారిక పర్యటన కోసం భారతదేశాన్ని ఎన్నుకుంటారు. రెండు దేశాల మధ్య బంధానికి ప్రాధాన్యత ఇస్తారు. ద్వీప దేశం నుంచి భారత సైనికులు వెళ్లాలని కోరుకుంటున్నట్లు కూడా ఆయన స్పష్టం చేశారు. మాల్దీవుల్లో సుమారుగా 70 మంది భారతీయ సైనిక సిబ్బంది, అక్కడ రాడార్ స్టేషన్లు, నిఘా విమానాలను నిర్వహణలో సాయం అందిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్ట్‌ల కోసం కాంట్రాక్టులను పునరుద్ధరించడానికి కూడా ఆదేశాధ్యక్షుడు ఆసక్తి చూపకపోవడం రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడానికి కారణమని చెప్పాలి. డిసెంబర్‌లో COP28 వాతావరణ చర్చల సందర్భంగా దుబాయ్‌లో మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జూతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఇరు దేశాల సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి ఒక కోర్ గ్రూప్‌ను ఏర్పాటు చేసేందుకు ఇద్దరూ అంగీకరించారు.

కానీ మాల్దీవుల అధ్యక్షుడి వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. ఉభయదేశాల ఒప్పందం తర్వాత కూడా ఆ దేశాధ్యక్షుడు ముయిజ్జు చైనాను సందర్శించాడు. పక్కనే ఉన్న ఇండియాను కాదని, తమకు చైనా సాయం కావాలని విజ్ఞప్తి చేశాడు. దక్షిణాసియాలో ‘స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్’ నిర్మాణంలో మాల్దీవులు, చైనాకు సహకరించడాన్ని ఇండియా వ్యతిరేకిస్తోంది. మొత్తంగా మాల్దీవులు ప్రజలు ఒకటి కోరుకుంటుంటే.. ఆ దేశాధ్యక్షుడు మరోలా వ్యవహరిస్తున్నారు. స్థానికంగా అధ్యక్షుడిపై వ్యతిరేకత ఎక్కువవుతోంది. ప్రధాని మోదీపై మాల్దీవుల రాజకీయ నాయకుల వ్యాఖ్యలపై భారత్ కఠిన వైఖరి తీసుకుంటోంది. సస్పెండ్ చేయబడిన జూనియర్ మంత్రుల అవాంఛనీయ ప్రవర్తనకు భారతదేశంలోని మాల్దీవుల రాయబారిని పిలిపించి వివరణ కోరింది. మేం కన్నెర్ర జేస్తే ఇక అంతే సంగతులని హెచ్చరించింది.

