Breaking Newshome page sliderHome Page SliderNational

నేను ఫోన్ , ఇంటర్నెట్ వాడను

ఆధునిక యుగంలో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా గడవని పరిస్థితి. కానీ, దేశ రక్షణకు సంబంధించి అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌‌ మాత్రం వీటికి ఆమడ దూరంలో ఉంటారట. శనివారం ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026’ లో పాల్గొన్న సందర్భంగా ఆయన వెల్లడించిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
“నేను ఇంటర్నెట్ వాడను, మొబైల్ ఫోన్ కూడా ఉపయోగించను అన్న మాట వాస్తవం. కేవలం కుటుంబ సభ్యులతో లేదా అత్యవసర పరిస్థితుల్లో ఇతర దేశాల ప్రతినిధులతో మాట్లాడేందుకు మాత్రమే చాలా పరిమితంగా ఫోన్ వాడుతుంటాను. ఇవి లేకుండానే నా రోజువారీ విధులను నిర్వర్తించేలా ప్రణాళిక వేసుకుంటాను” అని అజిత్ దోవల్‌‌ వివరించారు. కమ్యూనికేషన్‌కు మనం వాడుతున్నవే కాకుండా, సామాన్య ప్రజలకు తెలియని రహస్య మార్గాలు ఎన్నో ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో 3,000 మంది యువ ప్రతినిధులను ఉద్దేశించి అజిత్ దోవల్‌‌ ప్రసంగిస్తూ.. భవిష్యత్తు భారతాన్ని నడిపించే నాయకులకు ‘నిర్ణయాలు తీసుకునే శక్తి’ అత్యంత ముఖ్యమని చెప్పారు. మోటివేషన్ అనేది తాత్కాలికమని, కానీ క్రమశిక్షణ మాత్రమే స్థిరమైన విజయాలను ఇస్తుందని హితవు పలికారు.మన పూర్వీకులు స్వేచ్ఛ కోసం చేసిన త్యాగాలను గుర్తుచేసుకుంటూ, దేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.