Home Page SliderTelangana

ప్రధాని ఇంత దిగజారి మాట్లాడతారనుకోలేదు…సీపీఐ నారాయణ

ప్రధాని మోదీ ప్రభుత్వ ఖర్చులతో రాష్ట్రానికి వచ్చి రాజీకీయాలు మాట్లాడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. కేసీఆర్ ఎన్డీఏలో కలుస్తారన్నవిషయాన్ని ఇప్పుడు ప్రధాని చెప్పడమేమిటో అర్థం కాలేదన్న నారాయణ. ప్రధాని ఇంత దిగజారి మాట్లాడతారనుకోలేదన్నారు. మోడీ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలు మోదీని ఎలా నమ్మలేదో.. కేసిఆర్‌ను కూడా నమ్మే పరిస్థితి ఉండదని నారాయణ వ్యాఖ్యానించారు. పసుపుబోర్డు ప్రకటన ఈ ఎలక్షన్ ముందరే ఎందుకు గుర్తుకు వచ్చిందో బీజేపీ తెలపాలని కోరారు. మోదీ చెప్పాల్సిన అసలు రహస్యం ఏపీలో విలువైన ఇసుక బీచ్‌లు అదానీకి కట్టబెట్టడం విషయం గురించి. వేలాది కోట్లు తిన్నవారు బయట హాయిగా తిరుగుతున్నారు. వందల కోట్ల అవినీతి పేరుతో చంద్రబాబును జైల్లో పెట్టడం సబబు కాదని సీపీఐ నారాయణ అన్నారు. ఆయన రాత్రికి రాత్రి దేశం విడిచిపోయే మనిషి కాదని గుర్తు చేశారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేతలను మానసికంగా కృంగదీస్తున్నారు, ఇది అంత క్షేమకరం కాదు, కేసులు పెట్టడం కూడా మంచిది కాదన్నారు. టీడీపీని దెబ్బకొడితే బీజేపీకి హెల్ప్ అవుతుందనేది మోదీ ప్లాన్‌లో భాగమనే తోస్తోందన్న నారాయణ. దేశంలో నిజమైన కూటమి అంటే బీజేపీ- బీఆర్ఎస్- ఎంఐఎం పార్టీలే. మళ్లీ మోదీ అధికారంలోకి వస్తే దేశం ఉత్తర భారత్, దక్షిణ భారత్ అంటు విడిపోయే ప్రమాదం ఉంది. ఏపీలో ఎన్నికలు చాలాదూరంలో ఉన్నాయి. మా పార్టీకి సంబంధించి అక్కడ పొత్తులపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని నారాయణ తెలిపారు.