Home Page SliderTelangana

“నేను తండ్రిపేరు చెప్పుకుని రాలేదు..కష్టపడి ఎదిగి ముఖ్యమంత్రినయ్యా”-రేవంత్ రెడ్డి

“నేను తండ్రి పేరు చెప్పుకుని మంత్రిని కాలేదు, కష్టపడి ఎదిగి ముఖ్యమంత్రినయ్యా” అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ శాసనసభలో నేడు వాడివేడి చర్చలు జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల తూటాలు పేలాయి. కేంద్రబడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ శాసనసభలో చర్చ జరిగింది.  కేసీఆర్ ఎందుకు రాలేదంటూ సీఎం ప్రశ్నించగా, మాకు జవాబు చెప్పండి, మీకు కేసీఆర్ అవసరం లేదని కేటీఆర్ బదులిచ్చారు. దీనితో ఆగ్రహం చెందిన రేవంత్ రెడ్డి నేను తండ్రిపేరు చెప్పుకుని రాలేదు..కష్టపడి ఎదిగి ముఖ్యమంత్రినయ్యా అంటూ మండిపడ్డారు. దీనికి కేటీఆర్ బదులిస్తూ రేవంత్ పేమెంట్ కోటాలో సీఎం అయ్యారా అని ప్రశ్నించారు. అనంతరం కేసీఆర్‌ను రేవంత్ విమర్శించారు. విద్యుత్‌పై రాష్ట్రంలో ఒక విధానమే లేదని, రూ.7లక్షల కోట్లు అప్పులు చేశారని, రాష్ట్రాన్ని దివాలా తీయించారని మండిపడ్డారు. అందుకే ప్రజలు లోక్‌సభ ఎన్నికలలో గుండుసున్నా తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. దీనికి కేటీఆర్ మాట్లాడుతూ, కేసీఆర్‌ను కాదు, దమ్ముంటే మోదీని తిట్టండి. యాచించి కాదు, పోరాడి సాధించుకోవాలని, గతంలో తెలంగాణ కోసం మేం పోరాటం చేసి సాధించాం అని పేర్కొన్నారు. ఢిల్లీ తత్వం బోధపడిందా అంటూ ఎద్దేవా చేశారు.