NewsTelangana

ఒక్క రక్తం బొట్టు కారినా కేసీఆర్‌దే బాధ్యత

నాకు, నా కుటుంబ సభ్యులకు ప్రాణహాని

హుజూరాబాద్‌లో పదుల సంఖ్యలో గన్‌ లైసెన్సులిచ్చి బెదిరింపులకు దిగుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ‘నాకు, నా కుటుంబ సభ్యులకు ఒక్క రక్తం బొట్టు కారినా సీఎం కేసీఆర్‌దే బాధ్యత’ అని హెచ్చరించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ తాటాకు చప్పుళ్లకు భయపడనన్నారు. చంపుతా అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి భయపెట్టినా భయపడలేదని చెప్పారు. తనకు ఏమన్నా అయితే తెలంగాణ అగ్ని గుండం అయితదని చెప్పినట్లు పేర్కొన్నారు. నయీం ముఠా బెదిరింపులకు కూడా భయపడలేదని స్పష్టం చేశారు.

కేసీఆర్‌.. సంస్కార హీనుడు

సీఎం కేసీఆర్‌ సంస్కార హీనుడని, అబద్ధాలకోరు అని ఈటల విమర్శించారు. స్పీకర్‌ను ‘మరమనిషి’ అన్నందుకే ఇంత బాధపడుతున్న కేసీఆర్‌.. ప్రధానిని ఫాసిస్టు, దద్దమ్మ, చవట, భ్రస్టులు, రండ, లఫూట్‌, సన్యాసి, మతపిచ్చి, కులపిచ్చిగాళ్లు అంటూ నోటికొచ్చినట్లు తిట్టిన విషయాన్ని మర్చిపోయారా..? అని ప్రశ్నించారు. క్షమాపణ చెప్పాల్సింది తాము కాదని.. సీఎం కేసీఆర్‌ అని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన నిలబడిన తమను బయటికి పంపించారని విమర్శించారు.

అకారణంగా సస్పెండ్‌ చేశారు

తనను అకారణంగా, అత్యంత దుర్మార్గంగా సస్పెండ్‌ చేశారని ఈటల వాపోయారు. ఎమ్మెల్యేను పోలీసు వాహనంలో ఎక్కించి తీసుకెళ్లడం అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ జరగలేదన్నారు. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అన్నారు. ‘మరమనిషి అంటే సొంత ఆలోచన లేకుండా ఇతరులు చెప్పినట్లు చేసేవారు. నేను రాజీనామా చేసినప్పుడు కనీసం నా రాజీనామా లేఖ తీసుకోకుండా స్పీకర్‌ నన్ను అవమానించారు. గవర్నర్‌ ప్రసంగం లేకుండా సమావేశాలు ఎందుకు నిర్వహించడం లేదని అడిగినందుకు మమ్మల్ని సస్పెండ్‌ చేశారు. స్పీకర్‌ మా హక్కులు కాపాడలేక పోయారు. బీఏసీకి మమ్మల్ని పిలవాలని అడిగితే ముఖ్యమంత్రి గారిని పోయి అడగమన్నారు. స్పీకర్‌ మా హక్కులు కాపాడలేకపోయారు’ అని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్‌కు తల వంచిన కాంగ్రెస్‌, మజ్లిస్‌

అసెంబ్లీ అజెండాను అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి తయారు చేస్తారని ఈటల పేర్కొన్నారు. కానీ.. సీఎం గారు ఇచ్చిన అంశాలకే మజ్లిస్‌, కాంగ్రెస్‌ పార్టీలు తల వంచి వచ్చాయని ఎద్దేవా చేశారు. ‘సీఎం మాట ఇచ్చి తప్పేవాడు. ఆయన చెప్పిన పని చేస్తాడనే నమ్మకం ఎవరికీ లేదు. వీఆర్‌వోల, ఉద్యోగుల సమస్యలు, గొల్ల, కురుమల సమస్యలు.. ఆర్టీసీని కేసీఆర్‌ నిండా ముంచారు.. ఇవన్నీ సభలో చర్చించాలి. వీటికి అసెంబ్లీ పరిష్కారం చూపాలి. సభాపతి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. కానీ.. ఆ పని చేయలేదు` అని స్పీకర్‌పై ఈటల విరుచుకుపడ్డారు.