NationalNews

ప్రధాని రేసులో నేను లేను

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధానమంత్రి అభ్యర్థిగా తన పేరును ప్రతిపాదిస్తారన్న వార్తలను బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఖండించారు. ప్రధాని పదవికి తాను హక్కుదారేమీ కాదని.. తనకు ఆ కోరిక కూడా లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో పర్యటిస్తున్న నితీశ్‌ మంగళవారం సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో సమావేశమయ్యారు. బీజేపీతో పొత్తు తెంచుకోవడం తర్వాత తొలిసారి ఢిల్లీ వచ్చిన నితీశ్‌ కుమార్‌ పలువురు ప్రతిపక్ష నాయకులతో సమావేశమయ్యారు.

సోమవారం కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని కలిశారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జేడీఎస్‌ నేత కుమారస్వామిలతోనూ భేటీ కానున్నారు. వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలు ఒక్కతాటిపైకి వస్తే వచ్చే ఎన్నికల్లో సంచలనం సృష్టించవచ్చన్నారు.

విపక్షాలు కలవాలి: ఏచూరి

విపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా ఉంటే దేశ రాజకీయాల్లో భారీ మార్పులకు ఆస్కారం ఉంటుందని ఏచూరి అభిప్రాయపడ్డారు. బీజేపీతో తెగదెంపులు చేసుకొని నితీశ్‌ మంచి పని చేశారన్నారు.