ఎన్‌కౌంటర్ చేసినా భయపడను
జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా ఇప్పటం పర్యటన తీవ్ర ఉద్రిక్తంగా మారింది. మంగళగిరి నియోజవర్గంలోని ఇప్పటం అనే చిన్న గ్రామంలో టీడీపీ, జనసేన కార్యకర్తలకు చెందిన 53 ఇళ్లు, ప్రహరీలు కూల్చివేశారు. జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చామనే కక్షతోనే ఇళ్లను కూల్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ఇప్పటంలోని బాధితులను పరామర్శించేందుకు పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామానికి వెళ్లారు. పవన్ పర్యటన దృష్ట్యా అక్కడ మోహరించిన పోలీసులు పవన్ వాహనాన్ని అడ్డుకున్నారు. అరెస్ట్ చేస్తే చేసుకోండి అంటూ సీరియస్ అయ్యారు పవన్. పవన్‌కల్యాణ్‌ను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పవన్‌కు స్వాగతం పలకడానికి భారీ ఎత్తున అభిమానులు చేరుకున్నారు. అక్కడ కూల్చివేసిన ఇళ్ళను పరిశీలించిన పవన్ కళ్యాణ్.. బాధితులను పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… జనసేన సభకు ఇప్పటం గ్రామస్థులు స్థలం ఇచ్చారనే కుట్ర చేసి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. గుంతలు పూడ్చలేరు.. రోడ్లు వేయలేరుగానీ… విస్తరణ కావాలా? అసలు ఈ ప్రభుత్వానికి బుద్ధి ఉందా అని తీవ్రంగా విమర్శలు చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు చేసే పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. నలుగురు కిరాయి మూకలు ఉంటే భయపడతామా? అలాంటి వారు ఎంత మంది ఉన్నా బెదిరేది లేదన్నారు. ఎక్కడ ఎవరికి ఏం జరిగినా పూర్తి బాధ్యత సజ్జల రామకృష్ణారెడ్డిదే. ఆయనే పూర్తి బాధ్యత తీసుకోవాల్సిందేనని పవన్ తేల్చి చెప్పారు.

