కొండా సురేఖ ఇంటి దగ్గర హైడ్రామా
అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేస్తున్న ఎన్.సుమంత్‌పై ప్రభుత్వం ఇటీవలే వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అతడిని తక్షణమే విధుల నుంచి తప్పిస్తూ.. పీసీబీ కార్యదర్శి రవి గగులోతు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి 10 గంటల సమయంలో మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. విధుల నుంచి తొలగించబడిన సుమంత్‌ను అరెస్ట్ చేసేందుకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు మఫ్టీలో మంత్రి ఇంటికి వెళ్లారు. దీంతో కొండా సురేఖ కుమార్తె సుస్మిత వారితో వాగ్వాదానికి దిగింది. ఇంట్లోకి రావొద్దంటూ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా సుమంత్ అరెస్ట్‌కు కారణాలు చెప్పాలని పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సుమంత్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సరైన కారణాలు చెప్పడం లేదని ఫైర్ అయ్యారు. తమ ఇంటికి ఎందుకు వచ్చారని, లేకపోతే మా అమ్మను అరెస్ట్ చేసేందుకు వచ్చారా? అని పోలీసులను ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి నమ్మకంగా ఉండటం తప్పా. అని ప్రశ్నించారు.
సుమంత్ పై పలు ఆరోపణలు రావడంతోనే సర్కార్ విధుల నుంచి తొలగింపు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడం, ఐఏఎస్ (IAS) స్థాయి అధికారులపై ఒత్తిడికి పాల్పడటం వంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కొండా సురేఖ శాఖలో కీలక ఫైళ్ల మూమెంట్, డిప్యుటేషన్లు, బదిలీలు, ప్రతి పనికి ఓ రేటు అంతా సుమంత్ చెప్పినట్లే జరుగుతున్నాయనే ప్రచారం కూడా ఉంది. ఇదే విషయాన్ని అధికారులు, బాధితులు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎస్ (CS)తో పాటు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. తరువాత మంగళవారం సుమంత్‌ను విధుల నుంచి తొలగిస్తూ పీసీబీ కార్యదర్శి రవి గోగులోతు ఆదేశాలు జారీ చేశారు.