‘హైడ్రా’ చూపు మూసీ వైపు..వందలమందికి నోటీసులు
హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలు తొలగించడానికి ‘హైడ్రా’ దూకుడుగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మూసీ వైపు దృష్టి సారించింది. ఇప్పటికే వందల మందికి నోటీసులు జారీ చేశారని సమాచారం. 1350 మందికి మూసీ పరివాహక ప్రాంతంలో నిర్వాసితులను ఖాళీ చేయాలని సూచించింది. అయితే ప్రభుత్వం వారికి అండగా ఉండాలని నిర్ణయించింది. వారికి పునరావాసం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. గోల్నాక, చాదర్ ఘాట్, మూసారం బాగ్ వంటి ప్రదేశాలలో మూసీ ప్రాంతం ఆక్రమణలకు గురయ్యిందని గమనించారు. రాబోయే రెండురోజుల్లో రాత్రి,పగలు కూల్చివేతలు చేయాలని అదనపు సిబ్బందిని నియమించుకున్నారు. మరోపక్క కూకట్ పల్లి, అమీన్ పూర్ మున్సిపాలిటీ, పటేల్ గూడలో ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన కోట్ల రూపాయల విలువ చేసే విల్లాలలను నేలమట్టం చేశారు. మూసీ నిర్వాసితులను ఆదుకునేందుకు వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. బాధితుల వివరాలను హైడ్రా, రెవెన్యూ అధికారులు సేకరించనున్నారు. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో వారు సర్వే చేస్తున్నారు. అక్కడి ప్రజలను ఒప్పించి ఇళ్లను ఖాళీ చేయించడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.