Home Page Sliderhome page sliderTelangana

కందిక‌ల్‌లో హైడ్రా.. 2500 గ‌జాల ప్ర‌భుత్వ భూమి స్వాధీనం

హైదరాబాద్ జిల్లా బండ్ల‌గూడ మండ‌లం కందిక‌ల్ విలేజీలోని ప్ర‌భుత్వ స్థ‌లంలో ఆక్ర‌మ‌ణ‌ల‌ను హైడ్రా తొల‌గించింది. 303, 306 స‌ర్వే నంబ‌ర్ల‌లో ఉన్న 2500 గ‌జాల ప్ర‌భుత్వ స్థ‌లాన్నిహైడ్రా స్వాధీనం చేసుకుంది. వాస్త‌వానికి ఈ స్థ‌లం యూఎల్‌సీ ల్యాండ్ కాగా.. స‌య్య‌ద్ బ‌షీరుద్దీన్‌, స‌య్య‌ద్ అమీదుల్లా హుస్సేన్ క‌బ్జా చేశారు. అర్బ‌న్ ల్యాండ్ సీలింగ్ కింద ఉన్న భూమిని త‌న పేరు మీద రెగ్యుల‌రైజ్ చేసుకునేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌క‌పోయినా.. అందులో అనుమ‌తులు లేకుండా.. షెడ్డులు, రూంలు నిర్మించారు. ఈ మేరకు ప్ర‌భుత్వ భూమి క‌బ్జా జ‌రుగుతోంద‌ని.. కాపాడాల‌ని స్థానికుల నుంచి ప్ర‌జావాణికి ఫిర్యాదు అంద‌డంతో హైడ్రా అధికారులు క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు. సంబ‌ంధిత అధికారుల నివేదిక ఆధారంగా ప్ర‌భుత్వ భూమి అని నిర్ధారించుకున్నారు. హైకోర్టు కూడా ఈ అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను తొల‌గించాల‌ని 2 నెల‌ల క్రితం స్ప‌ష్ట‌మైన ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు అక్క‌డ నిర్మించిన ఆర్‌సీసీ రూంలు 4, రేకుల షెడ్డులు, షాపులు 4 వ‌ర‌కూ కూల్చివేసి.. ప్ర‌భుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ క్ర‌మంలో స్థానిక రాజ‌కీయ నాయ‌కులు, క‌బ్జా చేసిన వారికి చెందిన వారు కూల్చివేత‌ల‌ను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా స్థానిక పోలీసుల స‌హ‌కారంతో వారిని అదుపులోకి తీసుకుని కూల్చివేత‌లను హైడ్రా కొన‌సాగించింది. ప్ర‌భుత్వ భూమిని కాపాడ‌గ‌లిగామంటూ స్థానికులు సంతోషం వ్య‌క్తం చేశారు. హైడ్రాకు ఫిర్యాదు చేయగానే క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆక్రమణల తొలగింపును చేపట్టిన హైడ్రాకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, రెవెన్యూ, పోలీసు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.