యా.. అల్లాహ్.. కైసే జీనా..?
ఆపరేషన్ మూసీ పేరుతో హైడ్రా కూల్చివేతలను మొదలుపెట్టింది. దీనిలో భాగంగా హైదరాబాద్ లోని శంకర్ నగర్ బస్తీలో తమ ఇండ్లను కూల్చివేయడంతో సమీపంలోని మసీదు వద్ద యా.. అల్లాహ్.. కైసే జీనా..? ఎట్ల బతకాలి.. ఎక్కడికి పోవాలి అంటూ.. కంటతడి పెడుతూ మహిళలు ప్రార్థనలు చేశారు. ఆశల సౌధాలను కండ్లముందే కూల్చివేస్తుండడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. చాదర్ ఘాట్ మూసానగర్, శంకర్ నగర్ బస్తీలో బుధవారం హృదయవిదారకమైన దృశ్యాలు కనిపించాయి. పిల్లాపాపలతో ఇన్నాళ్లూ జీవించిన ఇండ్లన్నీ మొండి గోడలుగా దర్శనమిచ్చాయి. చివరిసారిగా తమ ఇండ్లను చూసుకుంటూ గత స్మృతులను మననం చేసుకుంటూ కనిపించారు. తమ ఇండ్లు కోల్పోవడంతో సమీప బంధువులను వీడి ఇతర ప్రాంతాలకు వెళ్తుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకరినొకరు పలుకరించుకుంటూ బాధను దిగ మింగుకొని వెళ్లారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం తమ గూడును చెదరగొట్టిందని ఆవేదన వ్యక్తంచేశారు.
