Home Page SliderTelanganatelangana,

గచ్చిబౌలిలో హైడ్రా దూకుడు…బోరున విలపించిన యజమాని

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి సిద్దిఖ్‌నగర్‌లో హైటెన్షన్ కొనసాగుతోంది. అక్కడ అక్రమ నిర్మాణంగా భావిస్తున్న ఐదంస్థుల భవనం కూల్చివేతకు సిద్ధపడ్డారు హైడ్రా అధికారులు. కేవలం 50 గజాల స్థలంలో ఐదంస్తుల భవనాన్ని నిర్మించడంతో ఈ చర్యలు చేపట్టారు. అంతే కాకుండా పక్కన ఖాళీ స్థలంలో ఇల్లు కట్టాలనే ఉద్దేశంతో గుంతలు తీయడంతో భవనం ఒకపక్కగా ఒరిగిపోయింది. దీనితో ఆ భవనంలో నివాసం ఉంటున్న 50 మంది ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్నారు. అధికారులకు సమాచారం తెలియడంతో నేడు ఈ భవనాన్ని కూల్చివేయనున్నారు. ముందుజాగ్రత్తగా చుట్టుపక్కల ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. మిర్యాలగూడలో ఉన్న తన భూమిని అమ్ముకుని ఇక్కడ ఇల్లు కట్టుకున్నానని, తన జీవితం అంతా ఈ ఇల్లేనని యజమాని లక్ష్మణ్ వాపోయాడు. తన బతుకు ఆగం అయిపోయిందని బాధను వ్యక్తం చేస్తున్నారు. అయితే నగరంలో అక్రమ నిర్మాణాలకు అంతే లేకుండా పోతోందని, అనుమతులు లేకుండా కట్టేస్తున్నారని, వీటిని కూల్చడం తప్ప ఏం చెయ్యలేమని పేర్కొన్నారు. స్థలం లేకపోయినా అంతస్తులు పేర్చుకుంటూ పోతున్నారని, ఇలాంటి ఇళ్ల వద్ద బిల్డింగులు కూలిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.