Breaking Newshome page sliderHome Page SliderTelangana

అంతరిక్ష రంగాల కేంద్రంగా హైదరాబాద్

హైదరాబాద్ నగరం సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరిక్ష రంగాలకు అడ్డాగా మారిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాయదుర్గం జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో జియో ప్యాక్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ‘బయో ఇన్‌స్పైర్డ్ ఫ్రాంటియర్స్–2025’ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధి కోసం హైదరాబాద్‌లోనే అనేక పరిశోధనా సంస్థలకు పునాది వేశారని గుర్తుచేశారు. ఆ దిశగా బీడీఎల్, డీఆర్‌డీవో, రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ వంటి ప్రముఖ సంస్థలు దేశ శాస్త్ర సాంకేతిక ప్రగతికి కీలకంగా మారాయని తెలిపారు.అలాగే ఐఐటి, ట్రిపుల్ ఐటీ, హెచ్‌సీయూ, ఉస్మానియా యూనివర్సిటీ వంటి విద్యా సంస్థలు హైదరాబాద్‌ను శాస్త్ర సాంకేతిక రంగంలో ముందంజలో నిలిపాయని పేర్కొన్నారు. ఫార్మా, ఐటీ, రక్షణ రంగాల్లో ఇప్పటికే ప్రత్యేక పరిశ్రమల క్లస్టర్లు ఏర్పాటయ్యాయని, ఇక అంతరిక్ష రంగంలోనూ ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు చేసి ఆ పరిశ్రమను ప్రోత్సహిస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.

ప్రభుత్వం స్పేస్ టెక్నాలజీలో ఆవిష్కరణలు, పరిశోధనలు, పెట్టుబడులు మరింతగా పెరగడానికి ఎల్లప్పుడూ సహకరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జియో ప్యాక్ సీఈఓ మరియు వ్యవస్థాపకుడు ముర్తజ కురసానితో పాటు పలువురు శాస్త్రవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.