పాడి కౌశిక్ రెడ్డికి ఝలక్ ఇచ్చిన సొంత గ్రామస్తులు
బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి ఆ పార్టీ నేతలు ఝలక్ ఇచ్చారు. సొంత గ్రామానికి చెందిన ముఖ్య నేతలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మాజీ జడ్పీటీసీ దాసరపు ప్రభాకర్, మాజీ సర్పంచ్ చిన్నాల ఐలయ్య, మండల కో ఆప్షన్ సభ్యుడు హమీద్, మాజీ ఉపసర్పంచ్ సమ్మరెడ్డితోపాటుగా 100 మంది బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.

ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆగడాలు సహించలేకపోతున్నామని, అందుకే కారు పార్టీకి గుడ్ బై చెబుతున్నామని వారు ప్రకటించారు. కౌశిక్ రెడ్డి, నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు. అనవసరమైన విషయాల్లో కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కౌశిక్ రెడ్డి లాంటి వ్యక్తితో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఉద్యమ సమయంలో కూడా లేనంతగా ఇప్పుడు సతాయిస్తున్నాడంటూ వారంతా ఆక్రోశం వెళ్లగక్కారు. కౌశిక్ రెడ్డి మానసికంగా వేధిస్తున్నారని వారు దుయ్యబట్టారు. కార్యకర్తలతో చర్చించి తాము ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తామన్నారు.

