Breaking NewsHome Page Sliderhome page sliderInternationalNews

హాస్పిటల్‌లో వందలమంది హత్య

సూడాన్ దేశంలోని ఎల్‌-ఫాషెర్ నగరంలో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఉన్న ఒక పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిపై రాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్సెస్‌ దాడి చేశాయి. ఈ దాడిలో రోగులు, వైద్య సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో సహా వందలమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటనలో నుంచి ప్రాణాలతో బయటపడ్డ ల్యాబ్‌ టెక్నీషియన్‌ అబ్దు-రబ్బు అహ్మద్ తన బాధను ఒక అంతర్జాతీయ ఛానల్ తో పంచుకున్నారు. ప్రస్తుతం ఆయన తావిలా అనే శిబిరంలో ఆశ్రయం పొందుతున్నారు. “ప్రతిరోజూ నవ్వుతూ చూసిన నా సహచరులు ఇక లేరు. నేను నా జీవితంలో ఒక భాగాన్ని కోల్పోయినట్టుగా ఉంది” అని కన్నీటి పర్యంతమై చెప్పారు. సూడాన్‌లో 2023 ఏప్రిల్‌లో సైన్యం , ఆర్ఎస్ఎఫ్ మధ్య పోరు మొదలైంది . ఆ పోరు క్రమంగా పౌరుల యుద్ధంగా మారింది. గత 18 నెలలుగా ఎల్‌-ఫాషెర్ నగరం ఆర్ఎస్ఎఫ్ ముట్టడిలో ఉంది. అక్టోబర్ చివర్లో వారు నగరాన్ని పూర్తిగా ఆక్రమించారు. ఈ సమయంలో సౌదీ మేటర్నిటీ హాస్పిటల్‌పై జరిగిన దాడిలో 460 మంది వరకు మరణించినట్లు ఒక నివేదిక తెల్పింది . ఆ సమయంలో ఆసుపత్రిపై బాంబులు, డ్రోన్లు, ట్యాంకులు దాడి చేశాయి. అబ్దు రబ్బు చెప్పిన ప్రకారం , “ఉదయం ఆరు గంటలకే బాంబులు వేయడం ప్రారంభమైంది. ప్రజలు భయంతో పరుగులు తీశారు. కొంతమంది కళ్ల ముందే చనిపోయారు” అని అన్నారు.
దాడి సమయంలో ఆరుగురు వైద్యులను ఆర్ఎస్ఎఫ్ దళాలు అపహరించాయి. వారి కుటుంబాలు వారికి డబ్బులు ఇచ్చి ఒకరిని మాత్రమే విడిపించగలిగాయి. మిగతావారి పరిస్థితి ఇప్పటికీ తెలియదు. అబ్దు రబ్బు సోదరి, ఇద్దరు సోదరులు ఆ రోజే చనిపోయారు. తల్లిదండ్రులు కనిపించలేదని ఆయన చెబుతున్నారు. “ఇంకా ఎల్‌-ఫాషెర్‌లో ఉన్న ప్రజల ప్రాణాలకు భయం ఉంది. వాళ్లను చంపేయవచ్చు లేదా మనుషుల కవచాలుగా వాడొచ్చు” అని ఆయన అన్నారు.తావిలా శిబిరానికి వందలాది పిల్లలు ఒంటరిగా చేరుకున్నారు. 15 ఏళ్ల ఇమాన్ అనే బాలిక తన తండ్రిని డ్రోన్ దాడిలో కోల్పోయింది. “అమ్మ, అన్నను ఆర్ఎస్ఎఫ్ దళాలు తీసుకెళ్లారు. అమ్మ ‘మీరు పారిపోండి’ అంది. కానీ అన్నను వాళ్లు వదల్లేదు.” 14 ఏళ్ల సమర్ అనే బాలిక తన తల్లిని కోల్పోయి, తండ్రి బంధించబడ్డారని తెలిపింది. ఆమె చెప్పిన ప్రకారం, పిల్లల ఆసుపత్రిని ఆర్ఎస్ఎఫ్ జైలుగా వాడుతున్నారు.
యేల్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఉపగ్రహ చిత్రాల్లో రక్తపు మచ్చలు, కాలిన మృతదేహాలు, సామూహిక సమాధులు ఉన్నట్లు గుర్తించారు.ప్రముఖ అంతర్జాతీయ ఛానల్ ధృవీకరించిన వీడియోల్లో ఆర్ఎస్ఎఫ్ సైనికులు గాయపడిన వారిపై కూడా కాల్పులు జరిపినట్లు ఉంది. అయితే ఆర్ఎస్ఎఫ్ మాత్రం ఇవన్నీ తప్పుడు ఆరోపణలని చెబుతూ తమను తాము సమర్థించుకోవడానికి వీడియోలు విడుదల చేసింది.ఈ సంఘటనలతో తావిలాలో ఆశ్రయం పొందిన అబ్దు రబ్బు చెబుతున్నాడు. “నేను తిరిగి ఎల్‌-ఫాషెర్‌కు వెళ్ళను. నేను చూసిన దాన్ని మరిచిపోలేను. నా జీవితంలో ఆశ అనేది ఇక మిగల్లేదు.” సూడాన్‌లో జరుగుతున్న ఈ యుద్ధం ప్రజల ప్రాణాలను బలిగొడుతోంది. ఆసుపత్రులు కూడా సురక్షితం కావడం లేదు. వైద్యులు, పిల్లలు, మహిళలు , ఎవ్వరూ రక్షణలో లేరు. ఈ యుద్ధంలో చనిపోతున్నది కేవలం మనుషులు మాత్రమే కాదు, మానవత్వం కూడా.