సెజ్ ఘటనపై మానవహక్కుల కమిషన్ కేసు
అచ్యుతాపురం సెజ్ దుర్ఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్ స్పందించింది. సుమోటోగా కేసు నమోదు చేసి, రాష్ట్ర డీజీపీకి, చీఫ్ సెక్రటరీకి నోటీసులు పంపింది. ఈ దుర్ఘటనపై రెండు వారాలలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై ఎఫ్‌ఐఆర్ వివరాలను, స్టేటస్ వివరాలను తెలపాలని కోరింది. మరణించిన వారికి లభించే పరిహారం, గాయపడిన వారికి అందించే వైద్యం గురించిన వివరాలను నివేదికలో పొందుపరచాలని ఆదేశాలు జారీ చేసింది. అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ఈ పేలుడు ఘటనలో 22 మందికి పైగా ఉద్యోగులు చనిపోయిన సంగతి తెలిసిందే. బాధితులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరామర్శించి కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించారు. తీవ్రగాయాలైన వారికి రూ.50 లక్షలు పరిహారం ప్రకటించారు. శుక్రవారం అనకాపల్లిలో బాధితులను వైసీపీ నేత జగన్ పరామర్శించారు.