“భూసేకరణలో మానవీయ కోణంతో వ్యవహరించాలి”:సీఎం రేవంత్
తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి NHAI పరిధి సమస్యలపై సమీక్షలో భూసేకరణ విషయంలో కలెక్టర్లకు కీలక సూచనలు చేశారు.కాగా సీఎం ఈ విషయంలో కలెక్టర్లు రైతులతో నేరుగా మాట్లాడాలన్నారు.రీజినల్ రింగు రోడ్డు(ఆర్ఆర్ఆర్) అంతటికీ ఒకే నెంబర్ ఉండేలా చూడాలన్నారు.ప్రత్యామ్నాయ భూ కేటాయింపులతో అటవీ భూముల స్వాధీనం చేసుకోవాలన్నారు.జాతీయ రహదారులకు భూ సేకరణ విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. నిబంధనల ప్రకారం ఎంత ఎక్కువ పరిహారం వస్తుందో అంత రైతులకు దక్కేలా చూడాలన్నారు. తెలంగాణలో భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్ హెచ్ఏఐ) పరిధిలో రహదారుల నిర్మాణానికి ఎదురవుతున్న సమస్యలపై రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నా భూ సేకరణ ఎందుకు ఆలస్యమవుతోందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. భూములకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలు తక్కువ ఉండడం, మార్కెట్ ధరలు ఎక్కువగా ఉండడంతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదని కలెక్టర్లు తెలిపారు.దీనిపై స్పందించిన సీఎం తరతరాలుగా వస్తున్న భూములను రైతులు శాశ్వతంగా కోల్పోతున్నారనే విషయాన్ని గుర్తించాలన్నారు. కలెక్టర్లు రైతులతో పిలిచి మాట్లాడి వారిని ఒప్పించాలని సూచించారు. రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం, ఉత్తర భాగం వేర్వురుగా చూడొద్దని, ఆ రెండింటికి కలిపి ఒకే నెంబర్ కేటాయించాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరగా, ఆయన సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఆ ప్రక్రియకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.