Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page sliderNewsPolitics

ఇబ్రహీంపట్నంలో భారీగా కల్తీ మద్యం పట్టివేత

విజయవాడ ,ఇబ్రహీంపట్నం లో భారీగా నకిలీ మద్యం తయారీ కేంద్రం బయటపడింది. ఎక్సైజ్ పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించి ఈ కల్తీ మద్యం రాకెట్‌ను బహిర్గతం చేశారు. ఇబ్రహీంపట్నం పరిధిలో ఉన్న టీడీపీ నేత అద్దేపల్లి జనార్ధనరావుకు చెందిన గోడౌన్‌లో ఈ నకిలీ మద్యం నిల్వ ఉన్నట్లు గుర్తించారు.
దాడుల్లో జనార్ధన్ సోదరుడు జగన్మోహనరావు, అనుచరుడు కట్టా రాజులను ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరి నుంచి లభించిన సమాచారం ఆధారంగా జనార్ధనరావు గోడౌన్‌పై సోదాలు జరిపి భారీ స్థాయిలో నకిలీ మద్యం, తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.సోదాల్లో లేబుల్స్, హోలోగ్రామ్ సీలింగ్ మిషన్లు, 35 లీటర్ల సామర్థ్యం కలిగిన 95 క్యాన్లు, వందల కొద్దీ ఖాళీ మద్యం బాటిళ్లు, కేరళ మార్ట్, ఓఎస్డ్ వంటి ప్రముఖ బ్రాండ్ల స్టిక్కర్లు స్వాధీనం చేశారు. పరిశీలనలో స్పిరిట్, కారిమిల్ మిశ్రమంతో నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం, కేసులో ప్రధాన నిందితుడు జనార్ధనరావు (ఏ1) ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతను ఆఫ్రికా దేశాలకు పారిపోయే అవకాశం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఆయన విదేశాల్లో ఉన్నట్లు కూడా సమాచారం అందినట్టు ఎక్సైజ్ సీఐ వెల్లడించారు.ఇదే సమయంలో, అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో కూడా ఎక్సైజ్ విభాగం సోదాలు కొనసాగిస్తోంది. ఇటీవల కల్తీ మద్యం తయారీ కేంద్రం వద్ద లభ్యమైన డైరీ ఆధారంగా అధికారులు మరిన్ని చోట్ల దాడులు చేస్తున్నారు. పీటీఎం మండలం సోంపల్లి గ్రామంలో బెల్టాపులపై ఎక్సైజ్ బృందాలు దాడులు జరిపి నకిలీ మద్యం సరఫరాకు సంబంధించిన ఆధారాలను స్వాధీనం చేసుకున్నాయి.పక్క జిల్లాలకు కూడా ఈ కల్తీ మద్యం సరఫరా చేసినట్లు ఆధారాలు లభించడంతో ఎక్సైజ్ శాఖ దర్యాప్తును మరింత వేగం పెంచింది . నకిలీ మద్యం తయారీ, రవాణా, నిల్వకు సంబంధించిన రాకెట్‌పై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.