స్వర్గ ఫలం సాగుతో భారీ లాభాలు..
నారింజ రంగు.. ఆగాకరలాంటి ఆకారం.. కోసి చూస్తే.. పసుపు పచ్చటి గుజ్జు మధ్య ఎర్రటి రసంలో ఒదిగిన గింజలు.. ఏమిటా అని ఆలోచిస్తున్నారా! ఇదే గ్యాక్ ఫ్రూట్. దీనిని గ్రేట్ అమెరికన్ కంట్రీ ఫ్రూట్ అని కూడా అంటారు. ఏపీలోని ఏలూరు జిల్లా పోలవరం మండలం మామిడిగొంది గ్రామానికి చెందిన బొరగం వెంకట్ ఇంటి ఆవరణలో ఈ మొక్కను సాగు చేశారు. కొత్త పంటలపై ఆసక్తితో వెంకట్ గతేడాది నవంబరులో మొక్కలను కేరళ నుంచి తెప్పించి, నాటారు. ఆ తర్వాత ఆ పండు విలువ తెలిసి సాగు ప్రారంభించారు. మంచి సక్సెస్ సాధించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. మే నుంచి దిగుబడి మొదలవ్వగా.. అధిక పోషకాలున్న ఈ పండుకు ‘స్వర్గఫలం’ అనే మరో పేరుంది. ఈ గ్యాక్ ఫ్రూట్ ను ఇతర రాష్ట్రాల్లో కిలో గరిష్ఠంగా రూ. 1500 లకు విక్రయిస్తుండగా.. ఇక్కడ మాత్రం ప్రస్తుతానికి రూ. 500 లకు అమ్ముతున్నారు. వెంకట్ ప్రయోగం విజయవంతం కావడంతో.. మరి కొందరు రైతులు కూడా ఈ పంటను సాగు చేయాలనే ఆసక్తి కనబరుస్తున్నారు.
