Andhra Pradesh

వణికిపోతున్న రైతులు

ఏపీలో రైతులకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. వరుస విపత్తులు పంటలను నాశనం చేస్తున్నాయి. పంట చేతికి వచ్చే తరుణంలో కురుస్తున్న వర్షాలు రైతులను నిలువునా ముంచుతున్నాయి. పండిన పంట అంతా వర్షార్పణం అవుతుంది. మాండుస్ తుఫాన్ నుంచి ఇంకా తేరుకోక ముందే అరేబియా సముద్రంలో ప్రస్తుతం అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో మంగళవారం నాటికి అండమాన్ మహాసముద్రంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది అల్పపీడనంగా మారి మరింత బలపడి మరో వాయుగుండం గానో మరో తుఫాను గానో మారే అవకాశం లేకపోవదని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే రాష్ట్ర రైతాంగానికి కోలుకోలేని స్థితి ఏర్పడుతుందనే భయాందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మూడు రోజుల క్రితమే మాండుస్ తుఫాను ప్రభావంతో చాలా జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు, కాలువలు పొంగి వేల ఎకరాల్లో పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయి. మరల మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా అండమాన్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రైతుల గుండెల్లో గుబులు రేపుతుంది.