మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక
దక్షిణ అమెరికా దేశమైన మెక్సికోకు సెప్టెంబరు 19వ తేదీ ఓ పీడకలగా మారింది. మెక్సికో సిటీ పశ్చిమ-ఆగ్నేయ దిశలో సోమవారం అర్ధరాత్రి సంభవించిన భారీ భూకంపంతో నగర ప్రజలు చిగురుటాకులా వణికిపోయారు. పలు భవనాలు కుప్పకూలిపోయాయి. రోడ్లపై దారి పొడవునా కూలిన చెట్లు దర్శనమిచ్చాయి. అయితే.. ప్రాణ నష్టం పెద్దగా సంభవించలేదు. 1985లోనూ సెప్టెంబరు 19వ తేదీనే మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 8.0గా నమోదైన ఆ భూకంపానికి 5 వైల మందికి పైగా చనిపోయారు. 2017లోనూ సెప్టెంబరు 19వ తేదీనే 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ దుర్ఘటనలోనూ 400 మందికి పైగా మృతి చెందారు.

రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.7
రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.7గా నమోదైన తాజా భూకంప తాకిడికి కార్లు, భవనాలు, చెట్లు ఊగిపోయాయి. తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు, జంతువులు పరుగులు తీశారు. మిచోకాన్ సరిహద్దుల్లోని పశ్చిమ తీరం కొలిమా వద్ద 15 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని యూఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. ఉపరితలం నుంచి మూడు కిలోమీటర్ల లోతులో గల ఫలకాల్లో మార్పుల వల్లే భూకంపం సంభవించిందని పేర్కొన్నది.

ఎగసిపడిన సముద్ర అలలు
ఫసిఫిక్ పోర్టులో ఓ డిపార్టుమెంటు భవనం కూలిపోవడంతో ఒకరు మరణించారు. ఓ ఆసుపత్రిలో భవనం గ్లాసులు పగిలి ఒకరు గాయపడ్డారు. మెక్సికో తీరప్రాంతం కావడంతో సముద్ర అలలు కూడా 3-9 అడుగుల ఎత్తుకు ఎగిసి పడటంతో యూఎస్-ఫసిఫిక్ కేంద్రం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధాన భూకంపం తర్వాత కూడా భూమి పలుమార్లు కంపించింది. దీంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. మొత్తానికి సెప్టెంబరు 19 సెంటిమెంటు మెక్సికన్లను భయాందోళనకు గురి చేస్తోంది.

