రామ.. రామ… బీజేపీ వర్సెస్ ఇండియా కూటమి
లోక్‌సభ ఎన్నికలకు వారాల ముందు అయోధ్యలోని రామాలయానికి సంబంధించిన వివాదాస్పద ‘ప్రాణ ప్రతిష్ఠ’ కార్యక్రమంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా సోమవారం జరగనుంది. రామమందిర నిర్మాణం ద్వారా దైవిక కల నెరవేరిందని బీజేపీ పేర్కొంది. అయోధ్య పట్టణం, చుట్టుపక్కల కొత్త విమానాశ్రయం, రూపురేఖలు మారిపోయిన రైల్వే స్టేషన్ ప్రాజెక్టులతో అయోధ్య ఇప్పుడు సర్వాంగసుందరంగా మూస్తాబయ్యింది. అయోధ్యలో జరిగే రామాలయ కార్యక్రమానికి ఆహ్వానితుల జాబితా చాలా పెద్దదే. కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా పది వేల మందికి ఆహ్వానపత్రాలు అందాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మినహా, ఇది బిజెపి ముఖ్యమంత్రులందరినీ ఈ కార్యక్రమానికి పిలవకపోవడం విశేషం. కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ముఖ్యనేత సోనియా గాంధీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సహా సీనియర్ ప్రతిపక్ష నాయకులను ఆహ్వానించినప్పటికీ వారెవరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం లేదు.

బీజేపీకి వ్యూహాలకు విపక్షాల కౌంటర్
‘ప్రాణ ప్రతిష్ఠ’ కార్యక్రమం ద్వారా బీజేపీ మతపరమైన ఘటనగా మార్చేస్తోందని ఇండియా కూటమి నేతలు బీజేపీపై విమర్శలు గుప్పించారు. మతం వ్యక్తిగత విషయమని కాంగ్రెస్ ఆహ్వానాన్ని తిరస్కరించింది. ఎంపీ రాహుల్ గాంధీ దీనిని నరేంద్ర మోడీ ఫంక్షన్ అని పిలిచారు. బిజెపికి ప్రధాన శత్రువుగా ఉన్న తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ కూడా మతం-రాజకీయాలను కలపొద్దంటూ మండిపడ్డారు. ఎన్‌సిపి అధినేత శరద్ పవార్, ఆర్‌జెడి ముఖ్యనేత లాలూ ప్రసాద్ యాదవ్, శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే ఆహ్వానాలను తిరస్కరించారు. ఓటు బ్యాంకును పెంచుకోవడానికి నిర్మాణంలో ఉన్న ఆలయాన్ని హడావుడిగా ప్రారంభించాలని బీజేపీ చూస్తోందని విపక్ష నేతలు ఆరోపించారు. బీజేపీని విమర్శిస్తున్నప్పటికీ.. ప్రాణప్రతిష్ట ద్వారా కేవలం కాషాయ పార్టీకే కాకుండా తమవైపునకు కూడా అటెన్షన్ వచ్చేలా విపక్షాలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయ్. బీజేపీకి ఓట్ బ్యాంక్ పెరక్కుండా ఉండేలా విపక్షాలు కార్యాచరణను సిద్ధం చేశాయ్. జనవరి 22న ప్రజల్లో ఉండేందుకు సొంత ఈవెంట్‌లను ప్లాన్ చేసుకుంటున్నారు.

బెంగాల్ సీఎం మాస్ యాత్ర
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాళీఘాట్ సందర్శించాలని నిర్ణయించారు. మంగళవారం వివిధ దేవాలయాల గురించి విలేకరుల ప్రశ్నలను బదులిచ్చారు. మతం వ్యక్తిగత సమస్య అని పేర్కొన్నారు. జనవరి 22న కోల్‌కతా సమీపంలోని కాళీఘాట్ ఆలయాన్ని సందర్శించాలని, ఆపై మత సామరస్య ర్యాలీని నిర్వహించాలని యోచిస్తున్నట్లు ఆమె చెప్పారు. దక్షిణ కోల్‌కతాలోని పార్క్ సర్కస్ మైదాన్‌లో సమావేశంతో ముగిసే ముందు, ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనేలా మమత ప్లాన్ చేస్తున్నారు. దేవాలయాలు, చర్చిలు, గురుద్వారాలు, మసీదులను సందర్శిస్తారు.

రాహుల్ గాంధీ అస్సాం టెంపుల్ ప్లాన్?
రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా అసోం పర్యటనలో ఉంటారు. గత సంవత్సరం తెలంగాణ-కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించడంలో సహాయపడిన భారత్ జోడో యాత్రను పునఃప్రారంభించారు.
జనవరి 22న అస్సాంలో ఆయన ఆలయాన్ని సందర్శిస్తారు.

వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న శరద్ పవార్, అఖిలేష్ యాదవ్
రామమందిర్ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కాకుంటే వచ్చే ఇబ్బందులేంటో తెలిసిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌కు మాబాగా తెలుసు. ఇప్పటికే రామమందిర ప్రాణప్రతిష్ట ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలిపిన పవార్… ఆలయ ప్రారంభం తర్వాత, దర్శనం తేలిగ్గా చేసుకోవచ్చన్నారు. ఆలోగా రామమందిర నిర్మాణం సైతం పూర్తవుతుందని.. అప్పుడు వెళ్లి స్వామిని పూజిస్తానని చెప్పారు. మొత్తంగా బీజేపీ ఎన్నికల్లో బెనిఫిట్ పొందడం కోసం ఆలయ నిర్మాణం పూర్తి కాకుండానే తెరిచేందుకు తహతహలాడుతోందని ఆయన విమర్శించారు.

ఢిల్లీలో సుందరకాండ, హనుమాన్ చలీసా పఠనం కేజ్రీవాల్ ఎత్తుగడ
రామాలయ ప్రారంభోత్సవానికి రావాలని ఇప్పటి వరకు ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రికి ఆహ్వానం అందలేదు. అయినప్పటికీ ఆయన దేశ రాజధాని ఢిల్లీలో ‘సుందర కాండ’ మరియు ‘హనుమాన్ చాలీసా’ కార్యక్రమాలను నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రజల కోరికలన్నీ తీరాలని రాముడు, హనుమంతుడిని ప్రార్థిస్తున్నానని ఆయన చెప్పారు.

మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే “మహా ఆరతి”
గత ఏడాది ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని చీలిక తర్వాత శివసేనను తిరిగి కలపడానికి పోరాడుతున్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి ఉద్ధవ్ థాక్రేకు కూడా ఇప్పటి వరకు ఆహ్వానం అందలేదు. ఏది ఏమైనప్పటికీ, జనవరి 22న నాసిక్‌లోని కాలరామ్ ఆలయాన్ని పార్టీ నాయకులు సందర్శించి, “మహా ఆరతి” నిర్వహిస్తామని థాక్రే స్పష్టం చేశారు. రాముడికి అంకితం చేయబడిన ఈ ఆలయం నల్ల రాతితో చెక్కారు. రాముడు వనవాస సమయంలో సీత, లక్ష్మణులతో కలిసి నాసిక్ ప్రాంతంలోని పంచవటిలో ఉండేవాడని నమ్ముతారు.

లాలూ, స్టాలిన్ దూరం దూరం…
బీహార్ అధికార సంకీర్ణంలో భాగమైన ఆర్‌జెడి వ్యవస్థాపకుడు, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సైతం తాను ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కాలేనని చెప్పారు. తమిళనాడు అధికార డిఎంకె ఇప్పటికే సైతం బీజేపీపై మండిపడింది. లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రజల దృష్టిని మళ్లించడానికి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని హైజాక్ చేస్తోందని దుయ్యబట్టింది. సీపీఎం సైతం అదే పంథా అనుసరిస్తోంది. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి తాము వెళ్లబోవడం లేదని… తాము మత విశ్వాసాలను గౌరవిస్తూనే… మతపరమైన కార్యక్రమాన్ని రాజకీయాలతో అనుసంధానించడాన్ని విమర్శిస్తున్నామని చెప్పారు.

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ జగన్నాథ్ కౌంటర్
రామ మందిర వేడుకల కోసం బిల్డ్ అప్ మధ్య, ఒడిశా జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్‌ను ఆవిష్కరించడానికి పెద్ద ప్రణాళికలను వేసుకున్నారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ BJD వ్యూహాత్మక చర్యగా భావించాల్సి ఉంటుంది. మతపరమైన భావాలను పెంచడమే కాకుండా రాష్ట్రంలో బిజెపిని అధిగమించడానికి కూడా ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు. పూరీ మౌలిక సదుపాయాలను మార్చే లక్ష్యంతో ‘అమా ఒడిషా, నబిన్ ఒడిషా’ పథకం కింద స్మారక ప్రయత్నంలో రాష్ట్రం ₹ 4,000 కోట్లకు పైగా పెట్టుబడితో కార్యక్రమాలు చేపట్టింది.

అయోధ్య మందిరానికి 2 వేల కోట్లు
రామ మందిరం చాలా అంచనాల ప్రకారం, దాదాపు 2 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనాలున్నాయి. ఏప్రిల్-మే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ అయోధ్య రామమందిరాన్ని ప్రచారానికి కేంద్ర బిందువుగా చేసుకోవాలని చూస్తోందని విమర్శలు వెల్లువెత్తుతుంటే.. ఇన్నాళ్లూ ఎవరూ చేయలేని రామకార్యాన్ని ప్రధాని మోదీ చేసి చూపిస్తున్నారని బీజేపీ చెబుతోంది. సోమవారం ప్రతిష్ట కార్యక్రమాల కోసం హోమాలు, యజ్ఞయాగాదులు నిర్వహిస్తున్నారు. రామ్ లల్లా విగ్రహాన్ని మైసూరుకు చెందిన ఒక కళాకారుడు చెక్కాడు. వేడుక ముగింపులో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.


 
							 
							