హైబీపీని మందులు వాడకుండా ఇలా తగ్గించుకోండి..
హైబీపీ కారణంగా అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. హైబీపీ ఒకసారి వచ్చిందంటే దాని ప్రభావం శరీరంలోని అన్ని అవయవాలనూ ప్రభావితం చేస్తుంది. దీనికి తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది. కానీ మందులు వాడకుండా కూడా మన జీవన శైలి, ఆహారంలో మార్పులు చేసుకుంటే బీపీని తగ్గించుకోవచ్చని వైద్యులు చెప్తున్నారు. ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంతో పాటు రోజువారీ జీవన విధానంలో మార్పులు చేసుకోవలసి ఉంటుంది. హైపర్ టెన్షన్‌ను నివారించడానికి, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేసుకోవాలి. అధిక బరువుతో బాధపడేవారు దానిని అదుపులో ఉంచుకోవాలి. శరీరబరువును సాధారణ బీఎంఐ పరిధిలో ఉంచితే రక్తపోటును నియంత్రించవచ్చు. రోజూ తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు, గుడ్లు, తృణధాన్యాలు, మొలకెత్తిన గింజలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని కూడా తగ్గించాలి. రోజు మొత్తం ఆహారంలో ఒక చిన్న టీస్పూన్ పరిమాణంలో మాత్రమే ఉప్పు వాడాలి. వారానికి 150 నిముషాల వ్యాయామం చేయడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి. ప్రతిరోజూ 7 నుండి 9 గంటల నిద్ర అవసరం. హైబీపీతో పాటు మధుమేహం, చెడు కొలెస్ట్రాల్ కూడా ఉంటే, వైద్యుని సంప్రదించి తగిన మందులను వాడాల్సి ఉంటుంది.

