Home Page SliderInternational

‘డీప్‌ఫేక్’ వీడియోలను ఎలా అడ్డుకుందాం…

డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించే అరాచకం అంతా ఇంతా కాదు. ఏది నిజమో, ఏది అబద్దమో తెలియడం లేదు. ఎవరి ఫొటోలు, వీడియోలు దొరికితే, ఎవరేం చేస్తారోననే భయాల మధ్య బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు సెలబ్రెటీలు, అందమైన అమ్మాయిలు. సరికొత్త సాంకేతికత, డీప్‌ఫేక్ వీడియోల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సాక్షాత్తూ దేశప్రధాని నరేంద్రమోదీనే ఈమధ్య హెచ్చరించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో క్రేజీ హీరోయిన్ రష్మిక వీడియో బయటపడడంతో అది డీప్‌ఫేక్ అని నిర్థారణ అవడంతో సినీ పరిశ్రమ అంతా ఆమెకు అండగా నిలిచింది. ఏఐ టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తూ ఇలాంటి వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రెటీలు దీనికి బలవుతున్నారు.

అయితే వీటిని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే నకిలీ వీడియోలను గుర్తించడం పెద్ద కష్టమేం కాదని నిపుణులు చెప్తున్నారు. ఈ వీడియోలలో వ్యక్తుల కదలికలు అసహజంగా ఉంటాయి. సందర్భానికి విరుద్ధమైన ముఖ కవళికలు, కళ్ల కదలికలు, ఎక్స్ ప్రెషన్లు లేకపోవడం, శరీరానికి తగినట్లు ముఖం లేకపోవడం వంటి గుర్తులతో అది అబద్దపు వీడియో అని గుర్తించవచ్చు. ఈ వీడియోల క్వాలిటీ కూడా బాగుండదు. ఫిక్సెల్స్ విడిపోయినట్లు కనిపిస్తూ ఉంటాయి. వీడియో, ఆడియోల మధ్య సమతుల్యత లేకపోవడం కూడా గమనించవచ్చు. అంతేకాక ఈ వీడియోలు ఎక్కడ నుండి పోస్టు అవుతున్నాయో అనేది తెలుసుకుంటే కూడా ఈ వీడియోలను అడ్డుకోవచ్చు. యువత ఈ విషయంలో అప్రమత్తంగా ఉండి, వీడియోలను, ఫొటోలను ఇష్టానుసారం షేర్లు చేయకూడదు. డీప్ ఫేక్ వీడియోల బారిన పడిన వారు కంగారు పడకుండా వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. తద్వారా పోస్టులు చేసిన వారిని గుర్తించడం వీలవుతుంది. ఎంత త్వరగా స్పందించి కంప్లైంటు చేస్తే అంత మంచిది. ఈ వీడియోల షేరింగును అడ్డుకోవచ్చు.