కర్నాటక డ్రామాకు శుభం కార్డు ఎలా పడిందంటే?
కర్నాటక సీఎం పీఠం కోసం ఇద్దరు నేతలు హోరాహోరీ ఢీకొనడంతో ఎవరిని ఎన్నుకుంటే ఏమవుతుందోనని కాంగ్రెస్ హైకమాండ్ తర్జనభర్జన పడింది. ఎవరికి సీఎం పదవి ఇచ్చినా మరొకరితో తలనొప్పి తప్పదని భావించిన పార్టీ పెద్దలు మొత్తం వ్యవహారంపై ఆచితూచి వ్యవహరించారు. ఇద్దరి మధ్య పోటీ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా విలేకరుల సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కలిసి పని చేసేందుకు ఇరువురు నేతలు తమ నిబద్ధతను వ్యక్తం చేశారన్నారు. ఐతే సిద్ధరామయ్య ఐదేళ్లు సీఎంగా కొనసాగుతారా అన్న ప్రశ్నకు వారు ఎలాంటి సమాధానం చెప్పలేదు. “అధికారం పంచుకోవడం అంటే కర్నాటక ప్రజలతో అధికారాన్ని పంచుకోవడం, మరేమీ కాదు.” అంటూ చెప్పుకొచ్చారు. లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు డీకే శివకుమార్ కర్నాటక బీజేపీ చీఫ్ గా కొనసాగుతారన్నారు.
“కర్నాటక సురక్షితమైన భవిష్యత్తు, ప్రజల సంక్షేమమే పార్టీ మొదటి ప్రాధాన్యత, దానికి హామీ ఇవ్వడంలో మేము ఐక్యంగా ఉన్నాం” అని డీకే శివకుమార్ ట్వీట్ చేశారు. కన్నడిగుల ప్రయోజనాలను కాపాడేందుకు మా చేతులు ఎప్పటికీ ఏకమవుతాయని, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సమేతంగా పనిచేస్తుందని సిద్ధరామయ్య అన్నారు. మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జోక్యంతో శివకుమార్ నంబర్ 2 స్థానాన్ని అంగీకరించారని, పార్టీ రాష్ట్ర యూనిట్ చీఫ్‌గా కొనసాగుతారని తెలుస్తోంది. “పార్టీ ప్రయోజనాల కోసం త్యాగం” చేయడానికి డీకే అంగీకరించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి.
ఐనప్పటికీ తాము సంతోషంగా లేమని కాంగ్రెస్ ఎంపీ, శివకుమార్ సోదరుడు డీకే సురేష్ అన్నారు. మా అన్న ముఖ్యమంత్రి కావాలనుకున్నారని, ఈ నిర్ణయంతో మేం సంతోషంగా లేమని ఆయన అన్నారు. ఈ ఉదయం సిద్ధరామయ్య, శివకుమార్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ను కలిశారు. అత్యున్నత పదవి కోసం పోరు మొదలైన తర్వాత ఇద్దరు నేతల మధ్య ఇదే తొలి భేటీ ఇదే. అనంతరం ఇద్దరు నేతలు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను కలిసేందుకు వెళ్లారు.


